Ioc: ఐఓఏ సిఫారసు జాబితా నుంచి 21 మందికి అనుమతి నిరాకరణ

  • కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల పేర్లపై కోత
  •  21 మందికి అనుమతి నిరాకరించిన కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ
  •  పి.వి. సింధు తల్లి, సైనా నెహ్వాల్ తండ్రి పేర్లు తొలగింపు
  • ప్రముఖ షూటర్ భర్త రోనక్ పేరూ తొలగించిన మంత్రిత్వ శాఖ

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల పేర్లతో రూపొందించిన ఓ జాబితాను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)  కేంద్ర క్రీడా మంత్రత్వ శాఖ కు పంపించింది. ఈ జాబితా నుంచి 21 మందికి అనుమతి నిరాకరిస్తున్నట్టు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో, ప్రముఖ షట్లర్ పి.వి. సింధు తల్లి విజయ, సైనా నెహ్వాల్ తండ్రి హరివీర్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి. 

కాగా, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న షూటర్ హీనా సిద్ధుకి భర్త రోనక్ పండిట్ పేరును ఈ జాబితా నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాజీ షూటర్ అయిన రోనక్ కొన్నేళ్లుగా హీనాకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా, భారత పిస్టల్, రైఫిల్ జట్టు హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నాడు. భారత జట్టు కోసం రోనక్ పేరిట గన్ పర్మిట్ లను మంజూరు చేయడం జరిగింది.

 కామన్వెల్త్ క్రీడలు సమీపిస్తున్న తరుణంలో రోనక్ పేరును జాబితా నుంచి తొలగించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. క్రీడా శాఖ తీరును భారత జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తప్పుబట్టారు.ఈ నేపథ్యంలో షూటర్ హీనా సిద్ధుకు మీడియాతో మాట్లాడుతూ, పదకొండేళ్లుగా షూటింగ్ క్రీడలో తాను ఉన్నానని, ఆరేళ్లుగా రోనక్ తనకు కోచ్ గా వ్యవహరిస్తున్నారని చెప్పింది. కోచ్ కు నిధులు విడుదల, ప్రయాణాలు మొదలైన విషయాలపై పోరాడి అలసిపోయానని ఆమె అసహనం వ్యక్తం చేసింది.

More Telugu News