Andhra Pradesh: మిల్లర్లు పాత బకాయిలు చెల్లించకుంటే క్రిమినల్ కేసులు తప్పవు : ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

  • సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ప్రత్తిపాటి
  • పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలి
  • రైస్ మిల్లుల్లో బియ్యం లావాదేవీలు కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలి  

మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పాత బకాయిలను చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఏపీ పౌరసఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అవసరమనుకుంటే ఆర్.ఆర్ యాక్ట్ కింద ఆయా మిల్లుల యజమానుల నుంచి రికవరీ చేయాలని పౌర సరఫరాల శాఖకు చెందిన జిల్లా మేనేజర్లను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, ఎండీ సూర్యకుమారి, 13 జిల్లాల డీఎంలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాల వారీగా మిల్లర్ల నుంచి రావాల్సిన పాత బకాయిలు, ధాన్యం సేకరణ, స్టాక్ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎంఆర్ కు సంబంధించి ఇంకా బకాయిలు మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నాయని మంత్రికి డీఎంలు తెలిపారు. పీడీఎస్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,  రైస్ మిల్లుల్లో బియ్యం లావాదేవీలు కచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చెయ్యాలని, ఏ, బీ రిజిస్టర్లను మిల్లర్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రత్తిపాటి ఆదేశించారు.

గోనె సంచుల సరఫరాలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టాలని, కొన్ని చోట్ల అంగన్‌వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం పథకం, గర్భిణులు, బాలింతలకు సరఫరా చేస్తున్న బియ్యం నాసిరకంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేసేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించిన వడ్లకు సరిపోలిన బియ్యం సక్రమంగా వచ్చే విధంగా కమిషనర్, ఎం.డి చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్ల పని తీరు గురించి ప్రత్తిపాటి వాకబు చేశారు. నెల్లూరు జిల్లాలో మిల్లర్ల నుంచి రావాల్సిన బకాయిలపై డీఎంలు దృష్టి సారించాలని, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకానికి స్వర్ణ, ఎన్ఎల్ఆర్ వంటి బియ్యం రకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, బియ్యం రవాణా సమయంలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, వచ్చే సమావేశం నాటికి డీఎంల పనితీరులో ప్రగతి సాధించాలని ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు.  

More Telugu News