Undavalli: ఆపరేషన్ ద్రవిడపై ఉండవల్లి స్పందన!

  • డబ్బుతో పొలిటికల్ ఆపరేషన్లు చేయలేం
  • ఎవరో కల్యాణ్ జీ చెప్పింది.. శివాజీ నమ్మి ఉండొచ్చు
  • వైసీపీ, టీడీపీలు కనీసం ఒక్కరోజైనా పోట్లాడుకోవడం మానేయాలి

ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడల్లాంటివి కేవలం సినిమాల్లోనే సాధ్యమవుతాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసి పొలిటికల్ ఆపరేషన్ చేస్తాయని అనుకోవడం అవివేకమవుతుందని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీకి అన్ని రాష్ట్రాల్లో నెగ్గాలనే ఉంటుందని... అయితే సినిమాల్లో చూపించినట్టుగా రాజకీయ వ్యూహాలు ఉండవని అన్నారు.

ఆపరేషన్ గరుడకు రూ. 4800 కోట్లు కేటాయించారన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ... ప్రజల ఓటింగ్ ను బట్టే పార్టీలు గెలుస్తాయని... పార్టీల వ్యూహాలతో కాదని అన్నారు. పార్టీల వ్యూహాలు కేవలం ఓటింగ్ ను ఆకర్షించడానికి మాత్రమే పనికొస్తాయని తెలిపారు. డబ్బుతోనే గెలుస్తామనుకుంటే... టాటాలు, అంబానీల వద్ద మన బడ్జెట్ అంత డబ్బుందని... నిమిషాల్లో గవర్నమెంటులను మార్చేయగలరని చెప్పారు. శివాజీ కథ చెప్పారని తాను అనడం లేదని... ఆయన కథే చెప్పాలనుకుంటే నిన్నే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరో కల్యాణ్ జీ అనే వ్యక్తి దీన్ని చెబితే, శివాజీ నమ్మి ఉంటారని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాన్ని విభజించే సమయంలో లోక్ సభ వెల్ లో కనీసం 100 మంది సభ్యులు ఆందోళనలు చేస్తున్నారని... ఆ ఆందోళనల్లోనే రాష్ట్రాన్ని విభజించారని ఉండవల్లి చెప్పారు. సభలో ఉన్న సభ్యులను లెక్కించడానికి అప్పుడు వీలైనప్పుడు... స్పీకర్ కు ఇప్పుడెందుకు కష్టమవుతోందని ప్రశ్నించారు.

టీడీపీ, వైసీపీలు ఆధిపత్య పోరును ఆపేయాలని... కనీసం మంగళవారమైనా కలసి అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వాలని కోరారు. పోట్లాడుకోవడాన్ని కనీసం ఒక్క రోజైనా వాయిదా వేయాలని అన్నారు. రెండు పార్టీలకు చెందిన 23 మంది ఎంపీలు కలసి స్పీకర్ వద్దకు వెళ్లి లెక్కించమని అడగాలని... లేకపోతే 2014లో లోక్ సభలో జరిగింది తప్పని ప్రకటించమని డిమాండ్ చేయాలని సూచించారు. ఆరోజు కరెక్ట్ అయింది... ఈ రోజు తప్పెలా అవుతుందని మండిపడ్డారు. 

More Telugu News