polavaram: భేష్.. పోలవరం ప్రాజెక్టు పనులపై ఎక్స్ పర్ట్ కమిటీ సంతృప్తి!

  • నవయుగ చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయి
  • స్పిల్ వే, స్పిల్ వే ఛానల్ పనులు వేగం పుంజుకున్నాయి
  • పరిహారం విషయంలో ప్రజల్లో సానుకూలత ఉంది

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి చాలా బాగుందని ఎక్స్ పర్ట్ కమిటీ (మసూద్ కమిటీ) అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు వేగం పుంజుకున్నాయని నివేదికలో ఎక్స్ పర్ట్ కమిటీ తెలిపింది. ట్రాన్స్ ట్రాయ్ స్థానంలో నవయుగ సంస్థ చేపట్టిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంది. స్పిల్ వే కాంక్రీట్ పనులు 1700 నుంచి 4,800 క్యూబిక్ మీటర్లకు చేరాయని తెలిపింది.

రోజుకు 6,000 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించింది. 74 శాతం డయాఫ్రాం వాల్, కాఫర్ డ్యామ్ పనుల్లో పురోగతి ఉందని చెప్పింది. కాంక్రీట్ పనులు చాలా నాణ్యతతో జరుగుతున్నాయని పేర్కొంది. లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. పరిహారం విషయంలో ప్రజల నుంచి సానుకూలత ఉందని తెలిపింది. పునరావాసంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఎక్స్ పర్ట్ కమిటీ నివేదిక కీలకంగా మారింది.


More Telugu News