Lok Sabha: చాలా దారుణం... స్పీకర్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేదు: వైసీపీ

  • స్పీకర్ ను కలిసేందుకు వెళ్లాం.. ఆమె కలవలేదు
  • సభలో గందరగోళం తగ్గేంత వరకు కూడా ఆమె వేచి చూడలేదు
  • ఓడిపోతామనే భయం బీజేపీకి ఉన్నట్టుంది

లోక్ సభ ప్రారంభమైన తర్వాత కేవలం మూడు నిమిషాల్లోనే వాయిదా పడింది. ఈ నేపథ్యంలో, స్పీకర్ వ్యవహారశైలిపై వైసీపీ మండిపడింది. ఈ సందర్భంగా పార్లమెంటు ప్రాంగణంలో వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, సభ ప్రారంభం కావడానికి ముందు తాము యథావిధిగా నినాదాలు చేస్తూ స్పీకర్ ను కలవడానికి యత్నించామని... కానీ, సుమిత్రా మహాజన్ తమను కలవలేదని చెప్పారు.

ఆ తర్వాత సభలోకి వెళ్లి తమతమ స్థానాల్లో తాము మౌనంగానే కూర్చున్నామని తెలిపారు. స్పీకర్ సభలోకి వచ్చిన వెంటనే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండానే సభను వాయిదా వేశారని... ఇది ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. గత ఆరు రోజులుగా తాము అవిశ్వాస తీర్మానాన్ని పెడుతూనే ఉన్నామని... వారికి ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా... కనీసం గందరగోళం తగ్గేంత వరకైనా స్పీకర్ వేచి ఉన్నట్టయితే బాగుండేదని అన్నారు.

ఓవైపు బీజేపీ మంత్రులు మాట్లాడుతూ, అవిశ్వాసంపై చర్చపై తమకు భయం లేదని ప్రగల్భాలు పలుకుతున్నారని... కానీ, సభలోకి వచ్చిన తర్వాత మాత్రం భయంతో పారిపోతున్నారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే ఏమీ కాదని... ఏపీ రాష్ట్ర సమస్యలను చెప్పుకోవడానికి తమకు ఒక అవకాశం వస్తుందని తెలిపారు.

బహుశా అవిశ్వాస తీర్మానంపై ఓడిపోతామనే భయం బీజేపీ నేతల్లో ఉందేమో అని అనుమానం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇలాంటి అవిశ్వాసాలు ఎన్నోసార్లు చోటు చేసుకున్నాయని... ఇప్పుడు వీరు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. గత కొంత కాలంగా పలు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోందని... ఇదే వారి భయానికి కారణమై ఉండవచ్చని చెప్పారు. తాము రాజీనామాలకు కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు.  

More Telugu News