KCR: కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ విఫలమవుతుంది: ప్రకాశ్ కారత్

  • మూడో కూటమిని నిర్మించడం అంత ఈజీ కాదు
  • ప్రాంతీయ పార్టీల మధ్య ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి
  • కాంగ్రెస్ కూటమి కూడా విఫలమవుతుంది

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రయత్నాలకు పలువురు జాతీయ స్థాయి నేతల నుంచి మద్దతు కూడా లభించింది. తాజాగా ఈ ఫ్రంట్ పై సీపీఎం అగ్ర నేత ప్రకాశ్ కారత్ పెదవి విరిచారు. బీజేపీకి, కాంగ్రెస్ కు అతీతంగా మూడో కూటమిని నిర్మించడం అంత ఈజీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ పార్టీల మధ్య విధానాలు, ప్రాయోజనాల్లో ఎన్నో వైరుధ్యాలు ఉంటాయని... ఇవన్నీ వాటివాటి ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే గొడుకు కిందకు రావడం అంత సులువు కాదని చెప్పారు. ఒకవేళ బీజేపీని ఓడించాలనుకుంటే... రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూసుకోవాలని చెప్పారు.

దీనికి తోడు డీఎంకే, ఆర్జేడీలాంటి పార్టీలు ఎప్పటికీ కాంగ్రెస్ తోనే ఉంటాయని కారత్ తెలిపారు. ఇదే సమయంలో టీఆర్ఎస్, టీడీపీ, ఒడిశాలోని బీజేడీలు కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఇష్టపడవని చెప్పారు. యూపీఏ తరహా కూటమిని మరోసారి ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని... ఇదే సమయంలో కాంగ్రెస్ పై విశ్వసనీయత లేని ఇతర పార్టీలు దాని సారథ్యాన్ని సమ్మతించవని... దీంతో కాంగ్రెస్ కూటమి కూడా విఫలమవుతుందని చెప్పారు. 

More Telugu News