mohammad shami: బీసీసీఐ క్లీన్ చిట్ తర్వాత షమీ స్పందన ఇదీ..!

  • గత 15 రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడి అనుభవించా
  • నాపై వచ్చిన మిగతా ఆరోపణలు కూడా తేలిపోతాయి
  • మైదానంలో ఇప్పుడు నేనేంటో నిరూపించుకుంటా
  • టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ

టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య హసీన్ జహాన్ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో పస లేదని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) తేలుస్తూ షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. హసీన్ ఆరోపణలపై నీరజ్ కుమార్ సారథ్యంలోని ఏసీయూ వారం పాటు దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే.  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడిన షమీ తాజాగా మీడియాతో మాట్లాడాడు. తాను అమాయకుడినని తొలి నుంచీ చెబుతూనే ఉన్నానని, ఇప్పుడది రుజువైందన్నాడు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో తాను విపరీతమైన ఒత్తిడికి గురైనట్టు చెప్పాడు. ఇప్పుడు బీసీసీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో దాని నుంచి బయటపడినట్టు పేర్కొన్నాడు. తన నిజాయతీని, దేశభక్తిని ప్రశ్నించడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు చెప్పాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ తేలిపోవడంతో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి తానేంటో నిరూపించుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు.

గత 10-15 రోజులు తన జీవితంలో అత్యంత కఠినమైనవని షమీ పేర్కొన్నాడు. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తనను తీవ్ర ఒత్తిడికి గురిచేశాయన్నాడు. ఇప్పుడు తన కోపాన్ని సరైన మార్గంలోకి మళ్లించి మైదానంలో తానేంటో నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. తాను మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ధైర్యంగా బరిలోకి దిగేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్నాడు. తనపై వచ్చిన మిగతా ఆరోపణలు కూడా దూదిపింజల్లా ఎగిరిపోతాయన్నాడు. షమీపై వచ్చిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తప్పని తేలడంతో బీసీసీఐ తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించింది.

More Telugu News