Sharad yadav: బీజేపీకి వ్యతిరేకంగా మరో కూటమి.. రంగంలోకి మాజీ ఎంపీ శరద్ యాదవ్

  • బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభం
  • మొన్న చంద్రబాబు, నిన్న కేసీఆర్, నేడు శరద్ యాదవ్
  • మహా కూటమి ఏర్పాటు చేయనన్నట్టు ప్రకటన

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్న తరుణంలో మరో కూటమిని ఏర్పాటు చేసేందుకు జేడీయూ బహిష్కృత నేత, మాజీ ఎంపీ శరద్ యాదవ్ ముందుకొచ్చారు. ఇప్పటికే మూడో ఫ్రంట్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యునైటెడ్ ఫ్రంట్ అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని ప్రతిపక్షాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు శరద్ యాదవ్ రంగంలోకి దిగారు.

మతతత్వ బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో మహా కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు శరద్ యాదవ్ పేర్కొన్నారు. లక్నోలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టేందుకు దేశమంతా పర్యటిస్తున్నట్టు చెప్పారు. సామాజిక న్యాయం కోసం పోరాడడం ద్వారా మాత్రమే బీజేపీకి అడ్డుకట్టవేయగలమని అభిప్రాయపడ్డారు.

వాజ్‌పేయి, అద్వానీ సమయంలో ఎన్డీయే కన్వీనర్‌గా తాను పనిచేశానని చెప్పిన శరద్ యాదవ్ నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ప్రస్తుతం విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, మోదీ అందరినీ విడగొట్టి, పాలిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ హిందూ-ముస్లిం అజెండా పనిచేయదని పేర్కొన్న శరద్ యాదవ్ బీజేపీకి నూకలు చెల్లినట్టేనని పేర్కొన్నారు.

More Telugu News