kavitha: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పై మండిపడ్డ సినీ నటి కవిత!

  • సినీ పరిశ్రమ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు
  • ఏసీ రూముల్లో కులుకుతున్నామన్న వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి
  • సినీ పరిశ్రమను కేసీఆర్ నెత్తిమీద పెట్టుకుంటే.. మీరు గౌరవం కూడా ఇవ్వలేదు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నటీనటులు మద్దతు ఇవ్వడం లేదని... ఇలాగైతే ఏపీ ప్రజలు సినిమాలను ఆడనివ్వరని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రజల ద్వారా వచ్చే కోట్ల రూపాయలు మాత్రమే సినిమావాళ్లకు కావాలని... రాష్ట్ర ప్రయోజనాలు వారికి పట్టవని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సినీనటి, బీజేపీ నాయకురాలు కవిత మండిపడ్డారు.

ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం సినీ పరిశ్రమ ఎప్పుడూ అండగానే ఉంటుందని... మీరే మీ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారని రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి కవిత అన్నారు. ఇప్పుడు మీ అవినీతిని కేంద్రం బయటపెడుతుందనే ఉద్దేశంతోనే యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. మీ నాటకాలకు తలూపడానికి ఫిల్మ్ ఇండస్ట్రీ సిద్ధంగా లేదని అన్నారు.  మేము ఏసీ రూముల్లో కులుకుతున్నామని మీరు తప్పుడు మాటలు మాట్లాడారని... వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే, పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. మీరు ఎన్ని రోజులు ఎమ్మెల్సీగా ఉంటారు? మీ నాయకుడు ఎన్ని రోజులు ఉంటారు? అని ప్రశించారు. సినీ పరిశ్రమ మాత్రం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమను కేసీఆర్ నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తున్నారని... ఆయనిచ్చే గౌరవంలో తెలుగుదేశం పార్టీ కొంత కూడా ఇవ్వడం లేదని అన్నారు.

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో మీ అధినేత చంద్రబాబు రాత్రికి రాత్రే అమరావతికి వెళ్లిపోయారని... దీన్ని ఏ చిత్తశుద్ధి అంటారని కవిత ప్రశ్నించారు. అలాంటి మీరు మా నటీనటుల గురించి, సినీ పరిశ్రమ గురించి మాట్లాడుతున్నారని... ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా, ఆదుకునేందుకు మేమున్నామంటూ ముందుకొచ్చే ఏకైక పరిశ్రమ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పారు. తుపాన్లు వచ్చినా, వరదలు వచ్చినా తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చిందని... దివంగత ఎన్టీఆర్ కూడా గతంలో జోలెపట్టి, బిచ్చమెత్తి ప్రజలకు సహాయపడిన ఘనత సినీ పరిశ్రమది అని చెప్పారు. 

More Telugu News