Mark Zukerbarg: తప్పు జరిగిపోయింది... ఒప్పుకుంటున్నా... ఫేస్ బుక్ కుంభకోణంపై తొలిసారి మౌనం వీడిన మార్క్ జుకర్ బర్గ్!

  • రెండు సంస్థల మధ్య విశ్వాసాల ఉల్లంఘన
  • ఇటువంటి ఘటనలు మరోసారి జరగబోనివ్వము
  • ఫేస్ బుక్ పేజీలో వివరణ

ఫేస్ బుక్ ఖాతాదారుల సమాచార చౌర్యంపై ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తొలిసారి మౌనాన్ని వీడారు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంపై వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తప్పు జరిగిపోయిందని, దాన్ని ఒప్పుకుంటున్నానని అన్నారు. రెండు సంస్థల మధ్య జరిగిన విశ్వాసాల ఉల్లంఘన ఇదని, ఇటువంటి ఘటనలు, తప్పులు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన ఆయన, ఈ విషయంలో ఫేస్‌ బుక్ తీసుకోబోతున్న న్యాయపరమైన చర్యలపైనా వివరణ ఇచ్చారు. ఎటువంటి డాటా చౌర్యం భవిష్యత్తులో జరగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు. ఫేస్‌ బుక్ వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్ లు దుర్వినియోగం చేస్తున్నాయని, వీటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ తరహా యాప్ లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు.

కాగా, ఫేస్‌ బుక్ డేటా చౌర్యంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. నిన్న ఐటీ మంత్రి రవిశంకర ప్రసాద్, జుకర్ బర్గ్ కు సమన్లు పంపిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

More Telugu News