Ponnam Prabhakar: ఏపీ సోదరులపై మనం చూపే సంస్కారం ఇదేనా?: టీఆర్ఎస్ కు టీకాంగ్రెస్ సూటి ప్రశ్న

  • 60 ఏళ్లు అన్నదమ్ముల్లా కలిసున్నాం
  • పక్కింట్లో శవం ఉంటే.. మన ఇంట్లో డప్పు కొట్టి సంబరాలు చేసుకుంటామా?
  • అవిశ్వాసానికి ఎందుకు అడ్డు తగులుతున్నారు?

60 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఏపీ సోదరులపై టీఆర్ఎస్ నేతలు చూపే సంస్కారం ఇదేనా? అంటూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. నిన్న పార్లమెంటు ప్రాంగణంలో టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ, పక్కింట్లో పెళ్లయితే, మన ఇంటికి రంగులు వేసుకుంటామా? అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా... పక్కింట్లో శవం ఉంటే, మన ఇంట్లో డప్పు కొట్టి సంబరాలు చేసుకుంటామా? అంటూ పొన్నం మండిపడ్డారు.

ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నట్టు టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇంతకు ముందు చెప్పారని... మరి ఇప్పుడు కేంద్రంపై అవిశ్వాసానికి ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఆడిస్తున్న నాటకంలో టీఆర్ఎస్ కూడా ఓ పాత్రధారే అని పొన్నం ఆరోపించారు.

తెలంగాణ ఇచ్చిన వెంటనే సోనియాగాంధీకి సాష్టాంగ నమస్కారం చేసిన కేసీఆర్ కు... కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదని అన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని, చేసేవన్నీ మోసాలేనని తెలిపారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పకపోతేనే ఆశ్చర్యపడాలని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ చెబితేనే పర్సెంటేజీలు తీసుకుంటున్నామని సిరిసిల్ల మునిసిపాలిటీ చైర్ పర్సన్ పావని బహిరంగంగా చెప్పినా... కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 

More Telugu News