Andhra Pradesh: నా నాలుగేళ్ల మౌనానికి కారణమిదే: చంద్రబాబు

  • తొలి రోజు నుంచి గొడవ పడితే రాష్ట్రాభివృద్ధికి విఘాతం
  • అందుకే నిధుల కోసం ఇన్నేళ్లు వేచి చూశాను
  • పార్లమెంట్ లో నిరసనలు కొనసాగించండి
  • టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఆదేశం

బీజేపీతో మిత్రుత్వం ఎప్పటికైనా ప్రమాదమేనని తనకు తెలుసునని, అయితే, తొలి రోజు నుంచే గొడవలు పెట్టుకుంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందన్న కారణంతోనే ఇన్నాళ్లూ మౌనంగా ఉండి, నిధుల కోసం, రాష్ట్రానికి న్యాయం జరగడం కోసం వేచి చూశానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో రభస, అసెంబ్లీలో బీజేపీ సభ్యులతో వాగ్వాదం తదితరాంశాలపై ఈ ఉదయం ఎంపీలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు ఎంపీలతో పాటు శాసనసభ వ్యూహ కమిటీ సభ్యులు, మంత్రులు పాల్గొనగా, చంద్రబాబు మాట్లాడుతూ, అవిశ్వాసాన్ని చర్చకు రానీయకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ప్రవర్తన కొంతకాలంగా మరీ భిన్నంగా మారిపోయిందని అభిప్రాయపడ్డ ఆయన, ఏపీకి నిధులివ్వకుండా ఇబ్బంది పెట్టాలని చూసిందని ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలన్న ఉద్దేశం బీజేపీకి ఏ కోశానా లేదని నిప్పులు చెరిగిన చంద్రబాబు, ఎవరికీ హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేస్తేనే ఆర్థిక సహాయానికి అంగీకరించానని మరోసారి స్పష్టం చేశారు.

ఆ తరువాత కేంద్రం మాట తప్పిందని, హోదా ఉన్న రాష్ట్రాలకు 90:10 కింద నిధులను ఇస్తూ, అదే విధమైన ప్యాకేజీ ఇవ్వడంలో మొండి చెయ్యి చూపిందని ఆరోపించారు. వేరే రాష్ట్రాలకు ఇస్తున్నట్లే మనకూ అదే పేరుతో ఇవ్వాలన్నదే తన డిమాండని, టీడీపీ చేస్తున్న వాదనలో హేతు బద్ధతను ప్రజలకు వివరించి చైతన్యం చేయాలని నేతలను చంద్రబాబు కోరారు.

 కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజల్లో పూర్తి అవగాహన ఉందని, అన్ని వర్గాల ప్రజలూ టీడీపీకి అండగా ఉన్నారని తెలిపారు. తొలి ఏడాది నుంచి గొడవలు పెట్టుకుంటే రాష్ట్రం దెబ్బతింటుందన్న భావనతోనే ఇన్నేళ్లూ ఓపికగా ఎదురుచూశామని వెల్లడించారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరితే కేంద్రం ఎదురుదాడి చేయిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, పార్లమెంట్ లో నిరసనలు కొనసాగించాలని మార్గ నిర్దేశం చేశారు.

More Telugu News