Amith shah: చంద్రబాబును మేం గెంటేయలేదు.. ఆయనే వెళ్లారు.. ఏపీకి అన్నీ ఇచ్చేశాం: అమిత్ షా

  • టీడీపీ బయటకు వెళ్లడం వల్ల మాకొచ్చే నష్టం ఏమీ లేదు
  • ఏపీకి దాదాపు అన్నీ ఇచ్చేశాం
  • వచ్చే ఎన్నికల్లో 300 సీట్లతో అధికారంలోకి
  • మాతో ఇంకా 30 పార్టీలున్నాయి

ఏపీకి గత నాలుగేళ్లలో తాము ఇచ్చినన్ని నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. బుధవారం ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే ఎన్డీయే నుంచి బయటకు వెళ్లారన్నారు. టీడీపీ వెళ్లినంత మాత్రాన తమకు భయం లేదని, కూటమిలో ఇంకా 30 పార్టీలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో  మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

తామెవరినీ కూటమి నుంచి మెడపట్టి గెంటేయలేదని, చంద్రబాబు వెళ్తామన్నప్పుడు తామెలా ఆపుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 300కు పైగా స్థానాలు గెలుచుకుంటామని షా జోస్యం చెప్పారు. తమకు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ మిత్రపక్షాలకు సరైన గౌరవం ఇచ్చామన్నారు. అవిశ్వాసానికి తాము భయపడడం లేదని, తమ ఎంపీలు అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు. అన్నాడీఎంకే, టీఆర్ఎస్‌లే అవిశ్వాసంపై చర్చకు అడ్డుపడుతున్నాయని షా ఆరోపించారు.

More Telugu News