Narendra Modi: సోషల్ మీడియాలో టీడీపీ-బీజేపీ డిష్యుం డిష్యుం!

  • సోషల్ మీడియాలో పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్న టీడీపీ-బీజేపీ
  • గ్రాఫిక్ ప్లేట్లతో ఒకరి అన్యాయాలను మరొకరు బయటపెడుతున్న వైనం
  • రక్తికట్టిస్తున్నసోషల్ మీడియా ఫైట్

నిన్నమొన్నటి వరకు మిత్రులుగా వున్నటీడీపీ-బీజేపీలు ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారాయి. ఏపీకి అన్యాయం మీరు చేశారంటే.. మీరు చేశారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. వ్యక్తిగత విమర్శల్లోనూ వెనక్కి తగ్గడం లేదు. మీడియా కనిపిస్తే చాలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ఇది నిన్నటి వరకు ఉన్న సంగతి. తాజాగా ఈ రెండు పార్టీల నేతలు సోషల్ మీడియాకు ఎక్కి ఒకరినొకరు ఎండగట్టుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో రక్తికట్టిస్తున్నారు.

విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అన్నీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మొండిచేయి చూపారంటూ టీడీపీ నేరుగా విమర్శలకు దిగగా, బీజేపీ కూడా తామేం తక్కువ కాదని చెబుతోంది. ఏపీకి అన్యాయం జరగడానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది.

తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకు అసలు విషయం చెప్పాలనే ఉద్దేశంతో రెండు పార్టీలు సోషల్ మీడియాను ఎంచుకున్నాయి. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ప్రచారం ప్రారంభించారు. అందులో భాగంగా చంద్రబాబు వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ‘యూటర్న్ అంకుల్’ అంటూ ఓ గ్రాఫిక్ తయారు చేసి చంద్రబాబు ఎప్పుడెప్పుడు యూటర్న్ తీసుకున్నదీ అందులో వివరించింది.

దీనిని వైరల్ చేసేందుకు బీజేపీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ సోషల్ మీడియా సభ్యులంతా ఒకే సమయంలో ఆ పోస్టును రీట్వీట్ చేయడం, ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడం ద్వారా వైరల్ చేస్తారన్నమాట. ఇంగ్లిష్‌లో వున్న గ్రాఫిక్ ప్లేట్‌ను తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఐటీ సెల్ తెలుగులోకి అనువదించి ప్రచారంలో పెడుతోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ రీట్వీట్లు చేస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాది వాళ్లు కావడం ఇక్కడ గమనార్హం.

మరోవైపు టీడీపీ కూడా బీజేపీ తీరును ఎండగడుతూ చేసిన ఓ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. ప్రధాని మోదీ ఎప్పుడెప్పుడు యూటర్న్ తీసుకున్నదీ అందులో వివరించింది. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ ప్రారంభించిన ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌కు చేరుకుంది. ప్రధాని మోదీ ఏపీని ఎలా మోసం చేసిందీ అందులో వివరించింది.

ఏపీని ముంచేసిన బీజేపీని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపై విమర్శలు చేస్తున్న జగన్, పవన్‌ తీరును కూడా సోషల్ మీడియా ద్వారా ఎండగట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక బీజేపీని తీవ్రంగా దెబ్బకొట్టే ఉద్దేశంతో టీడీపీ తెలుగు, ఇంగ్లిష్, హిందీలోనూ ప్రచారం చేసేందుకు ప్లాన్ వేసింది. అంతేకాదు.. తమ హయాంలో స్కాములే లేవని చెబుతున్న బీజేపీ హయాంలో జరిగిన కుంభకోణాలను వివరిస్తూ ఓ గ్రాఫిక్ ప్లేట్ తయారు చేయించి వదిలింది. ఇప్పుడిది వైరల్ అయింది.

More Telugu News