Sabbam Hari: మైనారిటీల ఓట్లు పోతాయనే జగన్ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు: సబ్బం హరి

  • బీజేపీతో కలిసి నడిచేందుకు వైసీపీ అంగీకారం
  • జగన్, విజయసాయిలకు మతి భ్రమించిందని అనుకుంటున్నారు
  • చంద్రబాబుకు ముందున్నది గడ్డుకాలమే

బీజేపీ కనుసన్నల్లో నడవడానికి వైసీపీ అంగీకరించిందని, అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెబితే మైనారిటీల ఓట్లు పోతాయనే ఉద్దేశంతో జగన్ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదని మాజీ ఎంపీ సబ్బం హరి పేర్కొన్నారు. మోదీ హోదా ఇస్తారనే విశ్వాసం ఉందంటూనే బీజేపీతో పోరాటం చేస్తామంటున్న జగన్, విజయసాయిరెడ్డిలకు మతి భ్రమించిందని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ప్రజల్లో ఏమూలో ఉన్న అసంతృప్తి పోయిందని సబ్బం హరి పేర్కొన్నారు. హోదా కోసం ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం వల్ల టీడీపీకి మంచే జరిగిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉండడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా పరిస్థితులను మార్చి తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాన్ని హరి వ్యక్తం చేశారు.

రాజకీయంగా ఎటువంటి కుట్రలనైనా చంద్రబాబు దీటుగా ఎదుర్కోగలరని, ఇతరత్రా అయితే మాత్రం కొంచెం కష్టమేనని వివరించారు. చంద్రబాబుకు మున్ముందు ఉన్నవి గడ్డు రోజులేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే దానిపై ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారని సబ్బం హరి పేర్కొన్నారు.

More Telugu News