Jana Sena: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి పవన్ కల్యాణే కారణం: జ‌న‌సేన నేత‌లు

  • అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా వైసీపీ, టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయి
  • రాష్ట్రం కోసం 25 మంది ఎంపీలు ఒకే తాటిపైకి ఎందుకు రావడం లేదు?
  • ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసీపీ, టీడీపీలు దెబ్బతీస్తున్నాయి
  • జనసేన పార్టీ ఒక్కటే ఆంధ్రుల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోంది

టీడీపీ, వైసీపీలు పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి తమ పార్టీ అధినేత పవన్ కల్యాణే కారణమని జనసేన నాయకుడు అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. ఈ రోజు జ‌న‌సేన పార్టీ నేత‌లు హైద‌రాబాద్‌లోని తమ కార్యాలయంలో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. ఈ సంద‌ర్భంగా అద్దేప‌ల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.... అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా వైసీపీ, టీడీపీ ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం కోసం 25 మంది ఎంపీలు ఒకే తాటిపైకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వైసీపీ, టీడీపీలు దెబ్బతీస్తున్నాయని, జనసేన పార్టీ ఒక్కటే ఆంధ్రుల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోంద‌ని చెప్పుకొచ్చారు. హోదా, చట్టంలో చెప్పిన అన్ని నిధులు రాష్ట్రానికి ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే బాగుంటుందని, తమ పార్టీపై కాదని అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గురించి విమర్శలు చేసే ముందు ఆయన తన శాఖలో వైఫల్యాల గురించి చెప్పుకుంటే మంచిదని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ బహిరంగ సభలో గుంటూరు అతిసార బాధితుల గోడును చెప్పిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. అలాగే, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని, ఆయన కుమారుడు చేస్తోన్న వ్యవహారాలు ఎవరికి తెలియనివి కావన్నారు. మంత్రి నారా లోకేశ్ అవినీతిపై పవన్ కల్యాణ్ మాట్లాడితే ఆ ఆరోపణలకు ఆధారాలు ఏవని, ఢిల్లీ వాళ్లు ఇచ్చారా? అని ఏపీ మంత్రులు అడుగుతున్నారని, అంటే ఢిల్లీ వాళ్లకు లోకేశ్ వ్యవహారాలు తెలుసన్నమాట అని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారాలపై ఆ స్థాయిలోనే విచారణ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజలే తమ డైరెక్టర్లని, ప్రజల డైరక్షన్ లోనే తాము నడుస్తున్నామని చెప్పారు. జనసేన అధినేత పబ్లిక్ మీటింగ్ లో లేవనెత్తిన సమస్యలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని హితవు పలికారు. తమకు ఏ పార్టీ దూరం కాదని, అలాగే ఏ పార్టీకీ దగ్గర కాదని అన్నారు. తమ అధినేత పవన్ కల్యాణ్ ఉద్దానం సమస్య లేవనెత్తిన తర్వాతే మంత్రులు అక్కడికి వెళ్లారని అన్నారు.

కాగా, జనసేన పార్టీని ఏపీలోనే కాకుండా తెలంగాణలో కూడా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామ‌ని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని జనసేన నాయకులు షేక్ రియాజ్ అన్నారు. జనసేన పార్టీగానీ, పవన్ కల్యాణ్ గానీ ప్రత్యేక హోదా విషయంలో డైవర్షన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... హోదా కోసం ఇప్పటి వరకు తిరుపతి, కాకినాడ, అనంతపురంలో సభలు నిర్వహించామని అన్నారు. విభజన హామీల అమలుకు రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ప్రత్యేక హోదా కోసం రేపు చేపట్టిన రోడ్ల దిగ్బంధం కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చేయాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News