Harish Rao: వందేళ్ల తరువాత కూడా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకునే విధంగా చేస్తున్నాం: హరీశ్‌ రావు

  • రీ ఇంజనీరింగ్ వల్లనే కాళేశ్వరం కు అనుమతులు
  • కాళేశ్వరం ద్వారా 36 లక్షల 9 వేల ఎకరాలకు సాగునీరు
  • వరంగల్‌కు కాళేశ్వరం తొలి ఫలితం
  • భవిష్యత్‌లో దేశానికి అన్నం పెట్టే భాండాగారంగా తెలంగాణ
  • సాగునీటి రంగంలో సమర్థవంతంగా పనులు

తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే తమ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ డిజైను, రీ ఇంజనీరింగు చేసినట్లు మంత్రి హరీశ్ రావు అన్నారు. భవిష్యత్‌లో దేశానికి అన్నం పెట్టే భాండాగారంగా తెలంగాణ మారబోతోంద‌ని చెప్పారు. భారతదేశంలోనే ప్రాజెక్టులను కట్టడంలో ఈ రాష్ట్రం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ప్రతి నియోజకవర్గానికి సాగునీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని హరీశ్ రావు చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37,09,000 ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించనున్నట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ కోనసీమ కానుందని ఆయన అన్నారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. వందేళ్ల తరువాత  కూడా కేసీఆర్ ను, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకునే విధంగా సాగునీటి రంగంలో పనులు సాగుతున్నట్టు హరీశ్ రావు తెలియజేశారు. కాళేశ్వరం లింక్ 1లో మూడు బ్యారేజీలు, మూడు పంప్ హౌజ్ లను అతి తక్కువ వ్యవధిలో 20 నెలల్లోనే పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు.

కాళేశ్వరం పనులు మూడు షిఫ్టులలో వేగంగా జరుగుతున్నట్టు హరీశ్‌ రావు చెప్పారు. గత ఆరు నెలల్లోనే 2 కోట్లకు పైగా సిమెంట్ బస్తాలు వాడినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా నిర్మాణ పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేసీఆర్ ప్రతిరోజూ లైవ్ టెలికాస్ట్ ద్వారా కాళేశ్వరం పనులను పర్యవేక్షిస్తూ, సూచనలు, సలహాలు ఇస్తున్నట్టు హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు సాగునీరందించాలనే లక్ష్యంతో కాకుండా ప్రజలను వంచించి కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ పెద్ద ఎత్తున ధనార్జనకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు మోబిలైజేషన్ అడ్వాన్స్ ల విధానాన్ని, ఈపీసీ పద్ధతి ని రద్దు చేసిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి లో ప్రతి నీటి చుక్కను వృథాగా పోనివ్వకుండా వాడుకుంటామని తెలిపారు. కృష్ణా, గోదావరుల్లో తెలంగాణకు రావలసిన న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ లో మన వాదనలు బలంగా వినిపిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. కేసు ట్రైబ్యునల్ లో ఉన్నందున కొన్ని విషయాలు అసెంబ్లీలో వెల్లడించడం సాధ్యం కాదని మంత్రి వివరించారు. తన ప్రాణాలు ఒడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించారని చెప్పారు.

తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా, కోటి ఎకరాల మాగాణిగా మార్చడం సీఎం సంకల్పం, పట్టుదల అని ఇరిగేషన్ మంత్రి తెలిపారు. ప్రతి సాగునీటి ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందని, అవి లేవంటూ జరుగుతోన్న దుష్ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ప్రాజెక్టుల సర్వే, డిజైన్లు, నిర్మాణ పనులకు సంబంధించి ప్రతి దశలోనూ అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు తరాల అవసరాలను దృష్తిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైను చేశారని మంత్రి అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వరుస బ్యారేజీలు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. తుపాకుల గూడెం నుంచి శ్రీరాం సాగర్ వరకు 270 కిలోమీటర్ల మేరకు గోదావరి నది ఏడాది పొడవునా 365 రోజుల పాటు సజీవంగా ఉంటుందన్నారు. మహారాష్ట్ర నుంచి సముద్రం వరకు నౌకాయానం జరుగుతోందని, మత్స్య పరిశ్రమ, టూరిజం అభివృద్ధి చెందుతుందని హరీశ్ రావు తెలిపారు.

ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద 16 లక్షల ఎకరాలకే ప్రతిపాదించారని రీ డిజైను, రీ ఇంజనీరింగు అనంతరం 37 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి లభించనుందని ఇరిగేషన్ మంత్రి గుర్తు చేశారు.ఆయకట్టు పెంచడం, అందుకు అనుగుణంగా రిజర్వాయర్ల కెపాసిటీ పెంచడం వంటి కారణాలతో ప్రాజెక్టు వ్యయం పెరగడం అనివార్యమని మంత్రి స్పష్టం చేశారు. నీటి లభ్యత ఆధారంగానే ఐదు ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశామని తెలిపారు. రీ డిజైనింగ్ తర్వాత కాళేశ్వరం కింద 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు ఆయకట్టు అదనంగా పెరిగిందన్నారు. పాలమూరు ప్రాజెక్టు కట్టకపోతే తెలంగాణ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసినట్లు అవుతుందని ఇరిగేషన్ మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తేనే భవిష్యత్ తరాలకు న్యాయం చేసిన వాళ్లమవుతామని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టును కట్టుకుంటేనే కృష్ణా జలాల కేటాయింపుల్లో న్యాయం జరుగుతుందన్నారు. కాంతనపల్లి దగ్గర గతంలో ప్రతిపాదించిన విధంగా ప్రాజెక్టు నిర్మిస్తే 20 గిరిజన గ్రామాలు, 11 వేల ఎకరాలు మునుగుతాయని హరీశ్ రావు చెప్పారు. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో జాగ్రత్త వహించి రీడిజైనింగ్ చేశామని వివరించారు. 20 గిరిజన గ్రామాలు ముంపునకు గురి కాకుండా కేవల 250 ఎకరాలు మునిగే విధంగా రీ డిజైను చేసినట్టు తెలిపారు.

తుపాకులగూడెం వద్ద కాపర్ డ్యాం ఏర్పాటు చేసి చెరువులకు నీరు ఇస్తున్నామని పేర్కొన్నారు. దుమ్ముగూడెం వద్ద నీటి లభ్యత అధికంగా ఉన్నందున ఖమ్మం జిల్లా వాసులకు నీరు అందించేందుకు దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ ఇంజినీరింగ్ చేశామని ఇరిగేషన్ మంత్రి తెలిపారు. ఒక్క ఎకరం ఎండిపోవడానికి వీలు లేకుండా ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశామని మంత్రి వివరించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ గురించి వస్తున్న విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. నీటి లభ్యత, నదులు లేని చోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కండలేరు, గోరకల్లు, వెలుగోడు, అవుకు తదితర ప్రాజెక్టులు నిర్మించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.

More Telugu News