Andhra Pradesh: కార్మికుల మర‌ణాల‌కు ప్ర‌భుత్వమే బాధ్యత వ‌హించాలి: ఏపీసీసీ

  • మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎటువంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు
  • విజయవాడలోని వాంబే కాల‌నీ ద‌గ్గ‌ర ఓ ప్లంబ‌ర్ వాట‌ర్ సంపులో ప‌డి మ‌ర‌ణించాడు
  • అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాట‌ర్ పైపులైన్లలో ప‌నిచేసే కార్మికుల జీవితాలు బాగోలేవు
  • స‌రైన వేత‌నాలు కూడా అందించ‌డం లేదు

కార్మికుల భ‌ద్ర‌త‌కు విజ‌య‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎటువంటి భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని, సింగ్‌న‌గ‌ర్ ఎక్స్‌ల్ ప్లాంట్ వాంబే కాల‌నీ ద‌గ్గ‌ర గుంజ గంగ‌రాజు (ప్లంబ‌ర్) అనే కార్మికుడు వాట‌ర్ సంపులో ప‌డి మ‌ర‌ణించ‌డం కార్పొరేష‌న్ అధికారుల నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నమని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మీసాల రాజేశ్వ‌ర‌రావు, అధికార ప్ర‌తినిధి వీ గురునాథ మండిపడ్డారు. కార్మికుల మర‌ణాల‌కు ప్ర‌భుత్వమే బాధ్యత వ‌హించాల‌న్నారు.

ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. కార్మికులకు క‌నీస భ‌ద్ర‌త సౌక‌ర్యాలు క‌ల్పించ‌క పోవ‌డంతో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాట‌ర్ పైపులైన్లలో ప‌నిచేసే కార్మికుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయన్నారు. ఏడాది కిత్రం మార్చి 14వ తేదీన ప‌శ్చిమ నియోజక‌వ‌ర్గం భ‌వానీపురంలో ఇద్ద‌రు కార్మికులు డ్రైనేజీలో ప‌డి మృత్యు‌వాత ప‌డ్డారని, ఇప్పుడు వాంబే కాల‌నీలో గంగ‌రాజు మ‌ర‌ణించాడని తెలిపారు.

కార్పొరేష‌న్ అధికారులు కార్మికుల‌కు స‌రైన వేత‌నాలు అందించ‌క‌పోగా.. వారి భ‌ద్ర‌త‌కు ఎటువంటి చర్య‌లూ చేప‌ట్ట‌లేద‌న్నారు. స్వ‌చ్ఛ‌భార‌త్ పేరిట ప్ర‌భుత్వం ప్ర‌తి కోనుగోలుపై వ‌సూలు చేస్తోన్న‌ ప‌న్నులను కార్మికుల‌ భ‌ద్ర‌త‌కు ఖ‌ర్చు చేయాల‌ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాల‌కు ఇళ్లు, పిల్ల‌ల చ‌దువుకు సాయం, న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని మీసాల రాజేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు.

More Telugu News