TRS: ఏపీకి న్యాయం జరగాల్సిందే.. సభను మేము అడ్డుకోవడం లేదు.. చేస్తున్నదంతా బీజేపీనే: టీఆర్ఎస్

  • సభను అడ్డుకుంటున్నది మేము కాదు
  • పక్కా ప్రణాళికతో సభను వాయిదా వేస్తున్నారు
  • అవిశ్వాసానికి మేము మద్దతు ఇస్తాం

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తమకు సోదరులేనని... వారికి మంచి జరగాలనే తాము కోరుకుంటామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. విభజన హామీలను అమలు చేయాలనే తాము కూడా అడుగుతున్నామని తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై తాము పోరాడుతున్నామని... తమ పోరాటం అవిశ్వాస తీర్మానానికి అడ్డు కాదని చెప్పారు.

బీజేపీకి ధైర్యం లేకనే సభను వాయిదా +వేస్తోందని అన్నారు. '11 నుంచి 12 గంటలకు వాయిదా, 12 గంటల నుంచి రేపటికి వాయిదా' అనే స్ట్రాటజీని బీజీపీ పెట్టుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కనుక... జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని తాము అడుతున్నామని చెప్పారు. తమ హక్కులను సాధించుకోవడం కోసం మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ సభలో ఆందోళనలు నిర్వహించడం సాధారణ అంశమేనని చెప్పారు.

గతంలో రాజకీయ నేతల వల్లే ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య తేడాలు వచ్చాయని... ఇప్పుడు అంతా అన్నదమ్ములమేనని టీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు. స్పెషల్ స్టేటస్ కోసం చర్చ వస్తే... తాము వంద శాతం మద్దతు ఇస్తామని ఇప్పటికే చెప్పామని అన్నారు. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని తాము ఖండిస్తున్నామని... చట్టం ప్రకారం ఏపీకి, తెలంగాణకు రావాల్సింది వచ్చి తీరాల్సిందేనని చెప్పారు.

ఏపీకి ఎంత ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని చెప్పారు. ఈరోజు తాము స్పీకర్ ను కలిశామని... సభను ఈ విధంగా వాయిదా వేస్తూ పోవడం మంచి పద్ధతి కాదని సుమిత్రా మహాజన్ కు చెప్పామని తెలిపారు. సభను ఆర్డర్ లో పెట్టేందుకు మీకు అధికారం లేదా? అని ప్రశ్నించామని చెప్పారు. వైసీపీ, టీడీపీలు బలమైన పార్టీలని... వారి పోరాటం కోసం టీఆర్ఎస్ ను బలిపశువును చేయవద్దని కోరారు.

More Telugu News