Telugudesam MP N Sivaprasad: సత్య హరిశ్చంద్రుడి గెటప్‌లో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన

  • కేంద్రం ఇచ్చిన మాట తప్పిందంటూ సత్యహరిశ్చంద్రుడి గెటప్‌లో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన
  • పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు
  • లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా

ప్రతిరోజూ మాదిరిగానే పార్లమెంటు ఆవరణలో ఈ రోజు కూడా టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఓ చిత్రమైన గెటప్‌తో కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీల విషయంలో ఎన్‌డీయే సర్కార్ మాట తప్పిందని పేర్కొంటూ ఆయన సత్య హరిశ్చంద్రుడి గెటప్‌లో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలుగు ప్రజలను మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మరోవైపు ఈ రోజు పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాలు పలు అంశాలపై గందరగోళ పరిస్థితులను సృష్టించాయి. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలంటూ టీడీపీ, వైకాపాలు ఓ వైపు... మరోవైపు కావేరీ జలాల బోర్డుపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్ వెల్‌లోకి చొచ్చుకుపోయి ఆందోళన చేపట్టాయి. దాంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు అదే 'రభస' పంథాను అనుసరించడంతో వేరే దారిలేక సభను రేపటికి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే సీను రిపీటు కావడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు.

More Telugu News