vijay: బంద్ జరుగుతున్నా షూటింగ్ చేసిన స్టార్ హీరో... కోలీవుడ్ లో వివాదం

  • 16 వ తేదీ నుంచి కొనసాగుతున్న కోలీవుడ్ బంద్
  • చెన్నై సెంట్రల్ సమీపంలోని విక్టోరియా హాలు వద్ద షూటింగ్ నిర్వహించిన మురుగదాస్, విజయ్
  • బంద్ లో కూడా పక్షపాతమా? అంటూ విమర్శలు 

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా తమిళ నిర్మాతల మండలి చేపడుతున్న బంద్‌ ను స్టార్ హీరో ఉల్లంఘించాడంటూ కోలీవుడ్ లో పెనుదుమారం రేగింది. దీని వివరాల్లోకి వెళ్తే... డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల తీరుకు వ్యతిరేకంగా కోలీవుడ్ నిర్మాతల మండలి గత 16వ తేదీ నుంచి బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో నిర్మాతలు షూటింగ్ లన్నీ నిలిపేశారు. డిజిటల్ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయి. ఒకట్రెండు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఇంతలో చెన్నైలోని సెంట్రల్ సమీపంలో విక్టోరియా హాలు వద్ద తమిళ అగ్రనటుడు విజయ్ ప్రధాన పాత్రలో మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘విజయ్‌ 62’ సినిమా షూటింగ్‌ నిర్వహించారన్న వార్తలు వివాదం రేపాయి. విజయ్ షూటింగ్ నిర్వహించడంపై జేఎస్కే సతీష్ సహా పలువురు నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రనటులకో న్యాయం, చిన్న సినిమా నిర్మాతలకో న్యాయమా? అని ప్రశ్నించారు. నిర్మాతల మండలిలో ఐక్యత లేదని, పెద్ద చిత్రాల షూటింగ్‌లకు అనుమతిచ్చి, చిన్న నిర్మాతలకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. బంద్‌ లో కూడా పక్షపాతం చూపించడం ఎంతవరకు సమంజసమని వారు నిలదీశారు.

 దీనిపై నిర్మాతల మండలి కార్యదర్శి ఎస్‌ఎస్‌ దురైరాజ్‌ స్పందిస్తూ, మార్చి 16 నుంచి అన్ని సినిమాల షూటింగ్ లు నిలిపేశామని అన్నారు. బంద్ కు వ్యతిరేకంగా ఎవరూ షూటింగ్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల షూటింగ్ తో సినిమా పూర్తవుతుందన్న వినతులతో 4 సినిమాల షూటింగ్‌ లకు అనుమతిచ్చామని ఆయన తెలిపారు.

More Telugu News