Raj Babbar: రాహుల్ గాంధీ పిలుపు.. కాంగ్రెస్‌లో సీనియర్ల రాజీనామాల హోరు!

  • ముఖ్యమైన పదవుల నుంచి సీనియర్లు తప్పుకోవాలన్న రాహుల్
  • ఒక్కొక్కరుగా పదవులకు రాజీనామాలు చేస్తున్న నేతలు
  • రాజ్యసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ యూపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు రాజ్ బబ్బర్ ప్రకటించారు. సీనియర్లు పక్కకు తప్పుకోవాలన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటనతో ఒక్కొక్కరుగా రాజీనామాల బాటపడుతున్నారు. రాహుల్ సూచన మేరకు తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు శాంతారామ్ నాయక్ ప్రకటించిన మరుసటి రోజే రాజ్ బబ్బర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

గుజరాత్ పీసీసీ చీఫ్ భరత్‌సింగ్ సోలంకి కూడా వీరిని అనుసరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ పార్టీ ముఖ్య పదవుల నుంచి సీనియర్లు తప్పుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీంతో సీనియర్లు ఒక్కొక్కరుగా పదవులకు గుడ్ బై చెప్పేస్తున్నారు.

అయితే, రాజ్యసభ ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ పరిణామాలు జరుగుతుండడం కాంగ్రెస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. బబ్బర్ తన పదవికి ఇప్పటికే రాజీనామా చేసినట్టు తెలుస్తున్నా అధికారికంగా బయటపడలేదు. బబ్బర్ తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి పంపించారని, ఇంకా ఆమోదం పొందలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యూపీ చీఫ్‌గా మరో వ్యక్తిని నియమించే వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారని చెబుతున్నారు. యూపీ కాంగ్రెస్ చీఫ్ పోస్టు కోసం నలుగురు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News