Venkaiah Naidu: మనసు మార్చుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. నేటి విందు రద్దు!

  • 12 రోజులుగా సభ సక్రమంగా సాగకపోవడంపై వెంకయ్య అసంతృప్తి
  • సభలో కొనసాగుతున్న టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యుల ఆందోళన
  • విందు రద్దు చేస్తున్నట్టు ప్రకటన

ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మనసు మార్చుకున్నారు. రాజ్యసభ సభ్యులకు నేడు ఇవ్వాలని భావించిన విందును అకస్మాత్తుగా రద్దు చేశారు. సభ 12 రోజులుగా సక్రమంగా సాగకపోవడంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ డిన్నర్ కోసం గతవారమే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, విపక్ష నేతలు, ఫ్లోర్‌లీడర్లు, అధికారులను ఇప్పటికే విందుకు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాలు కూడా సిద్ధం చేశారు. అయితే సభలో సభ్యుల గందరగోళం కొనసాగుతుండడంతో ఆహ్వానాలను పంపకుండా ఆపేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌పై టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ సభ్యులు, కావేరి బోర్డు ఏర్పాటు చేయాలని  డిమాండ్ చేస్తూ అన్నా డీఎంకే సభ్యులు, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు రాజ్యసభలో ఆందోళన కొనసాగిస్తున్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు‌ ప్రారంభమైనప్పటి నుంచీ ఇదే వరస. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై మూడో వారంలోకి అడుగుపెట్టడంతో ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి వస్తుందని భావించారు. అయితే అలా జరగకపోవడంతో వెంకయ్యనాయుడు ఆవేదనతో మనసు మార్చుకున్నారు. ఫ్లోర్ లీడర్ల సమావేశంలో సభా కార్యకలాపాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వెంకయ్య విందును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు

More Telugu News