Chandrababu: కేంద్ర ప్రభుత్వ వైఖరి బాధాకరం: అసెంబ్లీలో చంద్రబాబు

  • ఢిల్లీ-ముంబై కారిడార్ కు కేంద్రం నిధులిస్తోంది
  • మన కోస్టల్ కారిడార్ కు అప్పు చేయాల్సి వస్తోంది
  • విభజన హామీలను సమీక్షించే స్థితిలో కూడా కేంద్రం లేదు

హేతుబద్ధత లేకుండానే రాష్ట్రాన్ని విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. విభజన హామీలను సమీక్షించే పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందని... మన రాష్ట్రంలోని కోస్టల్ కారిడార్ కు మాత్రం అప్పు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి బాధాకరమని తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వెనుకంజ వేయబోమని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఏపీలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని... ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని చెప్పారు.

అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ వచ్చిందని చెప్పారు. శ్రీసిటీకి అనేక హార్డ్ వేర్ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామని తెలిపారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా తయారు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు వెతుక్కోవడం కాకుండా... ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చంద్రబాబు అన్నారు. 175 నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

More Telugu News