Srirama Navami: మహాశివరాత్రిలానే... శ్రీరామనవమిపైనా సందిగ్ధతే... 25న ఏపీలో, 26న తెలంగాణలో పండగ!

  • మహాశివరాత్రి విషయంలో నాడు సందిగ్ధం 
  • ఈనెల 25న నవమి వేడుకలంటున్న టీటీడీ
  • 26న భద్రాచలంలో కల్యాణానికి ఏర్పాట్లు

శ్రీరామనవమి పర్వదినాన్ని తెలుగురాష్ట్రాలు వేర్వేరుగా చేసుకుంటున్నాయి. ఈ నెల 25న పండగ నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ చెప్పినట్టుగా ఏపీ ప్రభుత్వం నడుస్తుండగా, తెలంగాణ సర్కారు భద్రాచలం పండితులు సూచించినట్టుగా 26న నవమి వేడుకలకు సిద్ధమైంది. నవమి తిథి ఈ నెల 25న సూర్యోదయం అయిన తరువాత ప్రవేశించి, 26న సూర్యోదయానికి ముందే ముగుస్తుండటమే వివాదానికి కారణమైంది.

ధర్మ శాస్త్రాల ప్రకారం, అష్టమితో కూడిన నవమి వస్తే, నాడు శ్రీరామనవమి చేసిన సందర్భాలు లేవని పండితులు అంటున్నారు. ఆ లెక్క ప్రకారం, శ్రీరామనవమి 26నే జరుపుకోవాలి. అయితే, ఇదే ధర్మశాస్త్రాలు సూర్యోదయం తరువాత కనీసం మూడు ఘడియలపాటు (సుమారు గంటంపావు సమయం) ఉంటేనే నాడు ఆ తిథిని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ 26న సూర్యోదయానికి ముందే నవమి వెళ్లిపోతుంది. ఇదే అసలు సమస్యగా మారగా, అష్టమితో కూడిన నవమి నాడు కల్యాణం చేయబోమని భద్రాచలం పండితులు తేల్చారు. సూర్యోదయానికి తిథి లేని రోజున నవమి ఎలా చేసేది లేదని టీటీడీ నిర్ణయించింది. దీంతో మహాశివరాత్రి లానే శ్రీరామనవమి కూడా రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోజుల్లో రానుంది.

More Telugu News