సంజయ్ దత్ భార్యను పట్టించుకోకుండా మాధురీ దీక్షిత్ వెంటపడేవాడు!: యాస్సేర్‌ ఉస్మాన్‌

20-03-2018 Tue 11:51
  • 1990ల్లో బాలీవుడ్ హిట్ పెయిర్ గా మాధురీ దీక్షిత్, సంజయ్ దత్
  • 'సాజన్', 'ఖల్ నాయక్' సినిమాలు సూపర్ హిట్
  • 'సాహిబాన్' సినిమాలో నటిస్తున్నప్పుడు ఐ లవ్యూ అంటూ వెంటపడేవాడు
బాలీవుడ్ ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ కోసమే సంజయ్ దత్ తన భార్యకు విడాకులిచ్చేశాడని సంజయ్‌ జీవితాధారంగా రాసిన ‘బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌’ పుస్తక రచయిత యాస్సేర్‌ ఉస్మాన్‌ ఆ పుస్తకంలో వెల్లడించారు. 1990ల్లో ఈ జంట సూపర్ హిట్ గా పేరొందిందని, వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సాజన్', 'ఖల్ నాయక్' వంటి సినిమాలు సూపర్ హిట్ లుగా నిలిచాయని ఆయన తెలిపారు. 1993లో సంజయ్‌, మాధురి ‘సాహిబాన్‌’ సినిమాలో నటిస్తున్న సమయంలో సంజయ్ దత్ భార్య రిచా శర్మకు కేన్సర్ సోకిందని వెల్లడించారు.

దీంతో చికిత్స నిమిత్తం కుమార్తె త్రిషాలాను తీసుకుని ఆమె న్యూయార్క్‌ వెళ్లారని తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకుంటున్న సమయంలో సంజయ్‌-మాధురీల ప్రేమ వ్యవహారం ఆమెకు తెలిసిందని, దీంతో అమెరికా నుంచి ముంబై వచ్చేశారని ఆయన పేర్కొన్నారు. అలా వచ్చిన వారిని రిసీవ్ చేసుకునేందుకు సంజయ్ దత్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లలేదని రచయిత తెలిపారు. ఆ తరువాత సంజయ్‌-మాధురీల రిలేషన్‌ గురించి ‘సాహిబాన్‌’ చిత్ర దర్శకుడు రమేశ్‌ తల్వార్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సెట్స్‌ లో యూనిట్ ఉందని కూడా చూడకుండా సంజయ్ ‘ఐ లవ్యూ’ అంటూ మాధురి వెంటపడేవాడని అన్నాడని గుర్తుచేశారు.

 ఆ తరువాత మాధురీ కూడా పలు ఇంటర్వ్యూల్లో సంజయ్‌ అంటే తనకు కూడా ఇష్టమేనని, ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటారని, ఆయనతో కలిసి ఉండడమంటే ఇష్టమని చెప్పిందని కూడా వెల్లడించారు. ఒకసారి సంజయ్‌ దత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘మాధురీని పెళ్లి చేసుకునేవాడిని’ అనేశాడని, దీంతో ఇంటర్వ్యూ చేసిన మహిళ షాకైందని రచయిత తెలిపారు. సంజయ్ దత్ తన భార్యకు విడాకులివ్వనని అంటూనే, 1993లో విడాకులిచ్చేశాడని ఆయన పేర్కొన్నారు. ఇంత జరిగినా రిచా మాత్రం ఆయనను ఒక్కమాట కూడా అనలేదని, ఆ బాధతో మరోసారి ఆమె కేన్సర్ బారినపడి మరణించారని ఆయన తెలిపారు. అనంతరం సంజయ్‌ దత్‌ మరో నటి మాన్యతను 2008లో వివాహం చేసుకోగా, వారికి ఇద్దరు పిల్లలు.