తండ్రికి ఉంచకుండా మందు తాగేశాడని కొడుకును మందలించిన తల్లి... అవమానంతో ఆత్మహత్యాయత్నం!

20-03-2018 Tue 11:19
  • ఉగాది నాడు ఘటన
  • ఇంటికి తెచ్చిన మద్యాన్ని ఒక్కడే తాగిన కొడుకు
  • ఆపై తల్లి తిట్టిందని ఆత్మహత్యాయత్నం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఉగాది పండగనాడు ఇంటికి తెచ్చుకున్న మద్యాన్ని కుమారుడు ఒక్కడే తాగడంతో, తండ్రికి ఉంచకుండా ఎందుకు తాగావని తల్లి మందలిస్తే, మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి మృత్యువుతో పోరాడుతున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, చిలకలగూడ పరిధిలోని నామాలగుండులో మహేష్, దేవయ్య తండ్రీ కొడుకులు. ఇద్దరూ అడ్డాకూలీలుగా పనిచేస్తున్నారు. 18వ తేదీన కూలీ పనికి వెళ్లిన వీరు, వస్తూ వస్తూ, రెండు సీసాల మద్యం తెచ్చుకున్నారు.

అయితే, రాత్రిపూట తండ్రికి తెలియకుండా మహేష్ ఒక్కడే మొత్తం తాగేశాడు. తండ్రికి మద్యం లేకుండా చేశావని, పండగపూట ఈ పని ఏంటని తల్లి మహేష్ ను మందలించింది. దీంతో ఆ మత్తులోనే ఒంటిపై కిరోసిన్ పోసుకున్న మహేష్, నిప్పంటించుకుని, బాధకు తాళలేక కేకలు వేశాడు. దీంతో స్థానికులు స్పందించి మంటలను ఆర్పి, చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.