Narendra Modi: సొంత పార్టీలోనే వ్యతిరేకత.. అవిశ్వాసంపై మోదీ, అమిత్ షాలు భయపడటానికి కారణం ఇదేనా?

  • బీజేపీలో లుకలుకలు
  • మోదీ, అమిత్ షాలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత
  • ఓటింగ్ కు సొంత ఎంపీలు రారేమో అనే భయంలో మోదీ, షా

కేంద్రప్రభుత్వంపై టీడీపీ, వైసీపీలు పెట్టిన అవిశ్వాసంపై ఇంత వరకు చర్చ జరగలేదు. ఆందోళనల మధ్యే ప్రతిరోజూ కొన్ని బిల్లులను ఆమోదింపజేసుకోవడం... ఆ తర్వాత సభ ఆర్డర్ లో లేదంటూ వాయిదా వేయడం నిత్యకృత్యమైపోయింది. ఎన్డీయేకు మెజార్టీ ఎంపీల బలం ఉంది. వాస్తవానికి సొంతంగా బీజేపీకే కావాల్సినంత మెజార్టీ ఉంది. ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితి అస్సలు లేదు. అయినప్పటికీ, అవిశ్వాసంపై చర్చను చేపట్టడానికి కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. దీనికి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న సమాధానం ఇదే.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల వైఖరి పార్టీలోని పలువురు నేతలకు నచ్చడం లేదట. ఇటీవల త్రిపురలో అగ్రనేత అద్వాణీ పట్ల మోదీ వ్యవహరించిన ధోరణితో, బీజేపీ సీనియర్లు షాక్ కు గురయ్యారు. ఈ నేపథ్యంలో, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే కచ్చితంగా ఎంతమంది సభ్యులు సభకు హాజరవుతారో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందట. ఇప్పటికే బీజేపీ ప్రధాన కార్యాలయంలో లెక్కలు కూడా తీశారట. ఈ లెక్కల్లో 302 మంది ఎంపీల మద్దతు తమకు లభిస్తుందని బీజేపీ పెద్దలు ఓ అంచనాకు వచ్చారు.

అయితే, సొంత ఎంపీలపైనే నమ్మకం లేకపోవడంతో... అవిశ్వాస తీర్మానంపై వెనకడుగు వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితులు తలకిందులైతే... అవిశ్వాసం నెగ్గినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగితే ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తాయని మోదీ, షా భావిస్తున్నారట. ఇది కర్ణాటక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాన్ని చూపిస్తుందని వారు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, అవిశ్వాసాన్ని చేపట్టకుండా... ఈ వారంలోనే సభను నిరవధిక వాయిదా వేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

More Telugu News