Uttam Kumar Reddy: మారుతున్న తెలంగాణ రాజకీయం... కాంగ్రెస్ కు మంద కృష్ణ మద్దతు... టీడీపీతో కాంగ్రెస్ పొత్తు?

  • ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామన్న ఉత్తమ్
  • ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలకనున్న మంద కృష్ణ
  • టీడీపీ కూడా కలసి వస్తుందని వార్తలు
  • కాంగ్రెస్ తో సీట్ల పంపిణీపైనా చర్చలు సాగుతున్నట్టు పుకార్లు!

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని టీపీసీసీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు మంద కృష్ణ మాదిగ మద్దతు పలకడం ఖాయమైపోయింది. నిన్న ఉత్తమ్, మంద కలసి సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు మాదిగ సామాజిక వర్గం నేత మంద కృష్ణతో ఉత్తమ్ చర్చలు జరిపి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరడం, అందుకాయన అంగీకరించడం జరిగిపోయిందని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు కాంగ్రెస్ తరఫున విస్తృత ప్రచారం నిర్వహించేందుకూ మంద కృష్ణ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఇక తెలంగాణలో టీడీపీ పార్టీ మరేదైనా పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయని గతంలో చంద్రబాబు, కొత్త పొత్తులపై సంకేతాలు ఇవ్వగా, టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఉంటుందన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కు చెక్ చెప్పాలంటే తమతో కలసి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నుంచి చంద్రబాబుకు స్నేహహస్తం వెళ్లిందని, దానికాయన సానుకూలంగా స్పందించగా, నిన్న ఇదే విషయమై ఢిల్లీలో రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని చర్చించారని తెలుస్తోంది.

వాస్తవానికి కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఆలోచన ఒకప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నుంచే వచ్చింది. అప్పట్లో పలువురు టీడీపీ నేతలు ఈ ఆలోచనను వ్యతిరేకించారు కూడా. ఇప్పుడైతే ఏకంగా సీట్ల పంపిణీపైనా వార్తలు వస్తున్నాయి. టీడీపీ 25 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లను అడుగుతుండగా, కాంగ్రెస్ మాత్రం 15 అసెంబ్లీ, ఒక్క లోక్ సభ సీటు ఇస్తామని చెబుతోందట. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి టీడీపీతో కలవక తప్పడం లేదని, రాష్ట్రంలో టీడీపీకి ఉన్న ఓట్లు టీఆర్ఎస్ ను నిలువరించేందుకు సహకరిస్తాయని భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్న పరిస్థితి.
ఏదిఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు గట్టి నిర్ణయంతోనే ఉన్నాయి. ఏఏ పార్టీల మధ్య పొత్తుంటుందన్న అంశంపై ఎటువంటి అధికారిక ప్రకటనలూ వెలువడనప్పటికీ, ఊహాగానాలు మాత్రం బాగానే చెలరేగుతున్నాయి.

More Telugu News