Ola cabs: నార్త్ కొరియాకు క్యాబ్ బుక్ చేసిన బెంగళూరు వాసి.. సరేనన్న ఓలా!

  • ఉత్తర కొరియాకు రూ.1,49,088 చార్జీగా పేర్కొన్న ఓలా
  • షెడ్యూల్‌, డ్రైవర్ వివరాలను ప్రయాణికుడికి పంపిన సంస్థ
  • ట్విట్టర్‌లో పెట్టడంతో వైరల్.. 
  • తప్పు జరిగిపోయిందన్న ఓలా

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లాలన్నా తమ క్యాబ్ బుక్ చేసుకోవచ్చని నిరూపిస్తోంది ఓలా సంస్థ. ఆ వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన రోహిత్ ఓలా యాప్ ద్వారా నార్త్ కొరియాకు క్యాబ్ బుక్ చేశాడు. విచిత్రంగా అందుకు ఓలా క్యాబ్ కూడా సరేనంది. అంతేకాదు, వెళ్లాల్సిన సమయం, ధర, డ్రైవర్ పేరు.. తదితర వివరాలను వెంటనే రోహిత్‌కు పంపింది. బెంగళూరు నుంచి నార్త్ కొరియాకు రూ.1,49,088 చార్జీగా పేర్కొంది.

రోహిత్ వెంటనే దీనిని స్క్రీన్‌షాట్ తీసి ‘ఓలా పనితీరు ఇలా ఉంది.. మీ క్యాబ్‌లో నార్త్ కొరియా వెళ్లడం సాధ్యమేనా? ఒకసారి చెక్ చేసుకోండి’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఓలా నిర్వాకంపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతుండడంతో స్పందించిన ఓలా.. సాంకేతిక తప్పిదంతో ఇలా జరిగిందని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు పేర్కొంది.

More Telugu News