Mohammad shami: అవును, షమీని కలిశా.. ఎట్టకేలకు నోరు విప్పిన ‘పాకిస్థానీ ఫ్రెండ్’ అలీష్‌బా

  • హసీన్ ఆరోపణల్లో ఎంతమాత్రమూ నిజం లేదు
  • షమీకి ఉన్న అభిమానుల్లో నేనూ ఒకరిని, అంతే
  • మేమిద్దరం మంచి స్నేహితులం 
  • అబద్ధం ఆడడం తెలియని వాడు దేశానికి ద్రోహం చేస్తాడా?

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ పాకిస్థానీ ఫ్రెండ్ అలీష్‌బా నోరు విప్పింది. తాను దుబాయ్‌లో షమీని కలిసిన మాట వాస్తవమే అయినా హసీన్ చేస్తున్న ఆరోపణల్లో మాత్రం నిజం లేదని కొట్టిపడేసింది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో భారత్ ఓడిన దగ్గరి నుంచి షమీతో పరిచయం ఉందని వివరించింది.

షమీపై హసీన్ జహాన్ పలు ఆరోపణలు చేయడంతోపాటు మ్యాచ్ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడని ఆరోపించారు. అలాగే దక్షిణాఫ్రికా టూర్ ముగించుకుని భారత్ వస్తూ దుబాయ్‌లో పాకిస్థాన్‌కు చెందిన అలీష్‌బా అనే మహిళను కలిశాడని, బ్రిటన్ నుంచి ఓ వ్యక్తి పంపిన డబ్బులను ఆమె ద్వారా తీసుకునేందుకే అక్కడికి వెళ్లాడని హసీన్ జహాన్ ఆరోపించారు. ఆమె ఆ డబ్బులు ఎందుకు ఇస్తుందో షమీ తనకెప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. అతడు తనను మోసం చేస్తున్నాడో, దేశాన్ని మోసం చేస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

గత కొంతకాలంగా తన పేరు మార్మోగుతుండడంపై అలీష్‌బా ఎట్టకేలకు స్పందించింది. ‘‘అవును నేను షమీని కలిశా. నా సోదరి షార్జాలో నివసిస్తుండడంతో తరచూ దుబాయ్ వెళ్తుంటా. షమీ ఒక సెలబ్రిటీ. అతడికి ఉన్న అభిమానుల్లో నేనూ ఒకరిని. అతడిని కలుసుకోవాలని కలలు కనేదానిని. కలిశాను. అందులో ‘బిగ్ డీల్’ ఏముంది?’’ అని ప్రశ్నించింది.

షమీ అంటే తనకు చాలా ఇష్టమని, దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత జట్టు దుబాయ్ మీదుగా స్వదేశానికి వెళ్తున్నట్టు తెలిసిందని, అదే సమయంలో అనుకోకుండా తాను దుబాయ్ వెళ్తుండడంతో షమీని కలిసే అవకాశం చిక్కిందని అలీష్‌బా వివరించింది. దుబాయ్‌లో ఓ హోటల్‌లో షమీని కలిశానని, బ్రేక్‌ఫాస్ట్ కూడా కలిసే చేశామని పేర్కొంది. హసీన్ చెబుతున్న ‘మహమ్మద్ భాయ్’ ఎవరో తనకు తెలియదని కొట్టిపారేసింది. అబద్ధం ఆడడం తెలియని వ్యక్తి దేశానికి ద్రోహం చేస్తాడని తాను భావించడం లేదని షమీని వెనకేసుకొచ్చింది.

More Telugu News