Indian Railway: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. స్టేషన్ లో దిగగానే ఓలా క్యాబ్ లో ఇంటికి చేరచ్చు!

  • ఓలా క్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఐఆర్‌సీటీసీ
  • వారం ముందుగా క్యాబ్‌ను బుక్ చేసుకునే అవకాశం
  • మనకు కావలసిన రీతిలో బుక్ చేసుకునే సౌలభ్యం 

రైలు ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులను ఇక నేరుగా వారి ఇంటి దగ్గరే దించనుంది. ఇందుకోసం ఓలా క్యాబ్‌తో ఐఆర్‌సీటీసీ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఆరు నెలలపాటు ఈ సేవలను ప్రయోగాత్మకంగా అందించనున్నారు. ప్రయాణానికి ఏడు రోజుల ముందే ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. అది కూడా మనకు కావాల్సిన కారును బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.  మైక్రో, మినీ, ప్రైమ్ సెడాన్, ప్రైమ్ ప్లే, ఆటో, షేర్.. ఇలా మనకు కావాల్సిన దానిని బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది.  

ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఐఆర్‌సీటీసీ యాప్, వెబ్‌సైట్‌కు లాగిన్ అయి ‘బుక్ ఎ క్యాబ్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. స్టేషన్‌లో దిగిన వెంటనే క్యాబ్ సిద్ధంగా ఉంటుంది. రైలెక్కిన ప్రయాణికులు క్షేమంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఓలా క్యాబ్‌తో ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది.

More Telugu News