Kerala Congress chief KM Mani: కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు.. కాంగ్రెస్ ఎంపీ సతీమణి 'లైంగిక' వేధింపుల వ్యాఖ్యలు!

  • 2012లో రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ వ్యక్తి తన కాలుని పదేపదే తాకారని ఆరోపణ
  • ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ కేరళ ఎంఎల్ఏ పీసీ జార్జ్ కుమారుడు షోనీ జార్జ్ డిమాండ్
  • ప్రకంపనలు సృష్టిస్తోన్న నిషా రాసిన పుస్తకం

కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం మణి కోడలు నిషా జోస్ చేసిన 'లైంగిక' వేధింపుల వ్యాఖ్యలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 'ఈ జీవితపు మరో కోణం... రాజకీయ నేత భార్యగా నా జీవితానుభవాలు' అనే శీర్షికతో రాసిన పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించింది. అందులో ఓ రైలు ప్రయాణంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటన గురించి ఆమె ప్రస్తావించడం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో అలజడులకు కారణమయింది. పార్లమెంటు సభ్యుడు జోస్ మణి సతీమణి అయిన నిషా జోస్ సూటిగా పేరు చెప్పకుండా కేరళకు చెందిన మరో రాజకీయ నాయకుడు 2012లో తనతో పాటు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 'లక్ష్మణ రేఖ'ను దాటాడని ఆమె ఆరోపించింది.

ఆ వ్యక్తి తన కాలుని పదేపదే తాకాడని ఆమె పేర్కొంది. ఇదే విషయాన్ని రైలులోని టీసీకి ఫిర్యాదు చేశానని, అయితే ఆయన తనకు సాయం చేయడానికి నిరాకరించారని ఆమె వాపోయింది. ఇద్దరూ రాజకీయంగా మిత్రులైనందు వల్ల ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని టీసీ తనకు ఉచిత సలహా ఇచ్చినట్లు నిషా చెప్పుకొచ్చారు. అయితే పుస్తకంలో ఆమె పొందుపరిచిన ఈ చేదు అనుభవాలను కేరళ ఎంఎల్ఏ పీసీ జార్జ్ కుమారుడు షోనీ జార్జ్ కొట్టిపారేశారు. అంతేకాక నిషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి పేరును బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు నిందితుడి పేరును నిషా బయటపెట్టకపోవడంతో ప్రజలు తన వైపు వేలు చూపుతున్నందు వల్ల ఇదే విషయమై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని జార్జ్ తెలిపారు. ఆయన ఇలా డిమాండ్ చేయడానికి కారణం, ఆ రైలు ప్రయాణం ఘటన చోటుచేసుకున్న సమయంలో నిషా, జార్జ్ ఇద్దరూ కేరళ కాంగ్రెస్ విభాగంలో పనిచేస్తున్నారు. మరోవైపు జార్జ్ కుటుంబసభ్యులు నిషాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె తన పుస్తకానికి ప్రచారం కల్పించుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వారు మండిపడుతున్నారు.

More Telugu News