Parekh Alluminex Ltd: మరో కుంభకోణం... యాక్సిస్ సహా 22 బ్యాంకులను రూ. 4 వేల కోట్లకు ముంచేసిన పీఏఎల్!

  • పారేఖ అల్యూమినిక్స్ పై కేసు నమోదు
  • ముగ్గురు డైరెక్టర్ల అరెస్ట్
  • చీటింగ్, నమ్మక ద్రోహం సెక్షన్ల కింద కేసు

మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాక్సిస్ బ్యాంకును రూ. 4 వేల కోట్ల మేరకు మోసం చేశారన్న ఆరోపణలపై పారేఖ్ అల్యూమినిక్స్ లిమిటెడ్ (పీఏఎల్)కు చెందిన ముగ్గురు డైరెక్టర్లను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. పీఏఎల్ కు చెందిన భవర్ లాల్ భండారీ, ప్రేమాల్ గోరగాంధీ, కమలేష్ కనుంగో అనే ముగ్గురిపై చీటింగ్, ఫోర్జరీ, నమ్మక ద్రోహం వంటి సెక్షన్ల కింద కేసులు పెట్టామని తెలిపారు. యాక్సిస్ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మొత్తం 20 బ్యాంకుల నుంచి పీఏఎల్ రుణాలు తీసుకుందని, 2011లో యాక్సిస్ బ్యాంకు ఫోర్ట్ శాఖ నుంచి ఎల్సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను తీసుకుందని తెలుస్తోంది. ఇందుకోసం బోర్డు సమావేశాల్లో తప్పుడు మినిట్స్ నమోదు చేశారని అధికారులు తేల్చారు. కాగా, ఇప్పటికే పీఏఎల్ పై ఎస్బీఐ, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ తదితరాలు ఇచ్చిన ఫిర్యాదులపై సీబీఐ విచారణ జరుపుతూ ఉంది. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో సైతం ఓ కేసు నడుస్తోంది.

కాగా, యాక్సిస్ సహా మూడు బ్యాంకుల నుంచి రూ. 125 కోట్ల షార్ట్ టర్మ్ రుణాలను తీసుకున్న పీఏఎల్ తొలుత వాటిని సక్రమంగా చెల్లించి, నమ్మకాన్ని పెంచుకుందని, ఆపై నిధుల స్వాహా ప్రారంభమైందని అధికారులు తెలిపారు. తప్పుడు మార్గాల్లో ఎల్సీలు తీసుకున్నారని, తమకు అవసరమైన రా మెటీరియల్ తో పాటు యంత్ర పరికరాలు కొంటామని చెప్పిన సంస్థ, తీసుకున్న రుణాలను సొంతానికి వాడుకుందని తెలిపారు. కాగా, మొత్తం 22 బ్యాంకుల నుంచి పీఏఎల్ రుణాలను పొందిందని తెలుస్తోంది. మూడు షెల్ కంపెనీలను భాగ్యోదయ్ ఫెర్రో అలాయిస్, భూమికా ఫాయిల్స్, భూషణ్ ఫాయిల్స్ పేరిట రిజిస్టర్ చేయించి, ఆ కంపెనీలకు నిధులను తరలించారని విచారణలో వెల్లడైంది.

More Telugu News