ali: 'సీతాకోక చిలుక' సినిమా కోసం డిప్ప కటింగ్ కొట్టించి .. గోచీ పెట్టేశారు: అలీ

  • కొన్ని సినిమాలు చేశాక రాజమండ్రి వెళ్లిపోయాను
  • ఏడిద నాగేశ్వరరావు గారు నన్ను గుర్తుపెట్టుకున్నారు  
  • 'సీతాకోకచిలుక' కోసం మళ్లీ పిలిపించారు

'సీతాకోక చిలుక ' సినిమాలో హీరో స్నేహితుల్లో ఒకడిగా అలీ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ఆయన నటన చూసిన వాళ్లంతా .. ఈ కుర్రాడు తప్పకుండా పైకొస్తాడు అని చెప్పుకున్నారు. ఆ తరువాత కాలంలో అదే నిజమైంది. ఈ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ .. "ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలో .. భారతీరాజా దర్శకత్వంలో 'సీతాకోకచిలుక' సినిమా మొదలైంది" అని చెప్పారు.

 "ఈ సినిమాలో నేను చేసిన పాత్రకి .. ముందుగా ఒక కుర్రాడిని పెట్టారు. అయితే ఆ కుర్రాడి యాక్షన్ భారతీ రాజాకి సంతృప్తిని కలిగించలేదు. అప్పటికే కొన్ని సినిమాలు చేసిన నేను .. తిరిగి రాజమండ్రి వెళ్లిపోయాను. నేను చేసిన సినిమాలు చూసిన ఏడిద నాగేశ్వరరావుగారు ఆ పాత్ర కోసం నన్ను పిలిపించారు. సహాయ దర్శకుడు వంశీ .. ఈ సినిమాలో హీరో స్నేహితులుగా చేస్తున్న వాళ్లందరినీ ఒక వ్యాన్ లో తీసుకుని వెళ్లారు.

అక్కడ ఓ చెట్టుకింద ఒకడు కత్తి నూరుతూ కనిపించాడు. వంశీ ఏదో సైగ చేయగానే 'యారు ముందు' అని వాడు అనడంతో చచ్చేంత భయం వేసింది. ఒక్కొక్కరిగా వాడిముందు కూర్చోగానే .. ముగ్గులో అద్దిన దారంతో తలచుట్టూ మార్క్ చేసి డిప్ప కటింగ్ కొట్టేశాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక అందరికీ పాత నిక్కరూ .. చొక్కా ఇచ్చారు. నాకు మాత్రం 'గోచీ' పెట్టేశారు" అంటూ నవ్వేశారు.  
 

More Telugu News