Community service registrar: నన్ను అరెస్టు చేయండి మహాప్రభో: ఖాకీలకు కాసేపు చెమటలు పట్టించిన కోవై రైతు...!

  • చట్టవిరుద్ధంగా ఓ ఎర్రచందనం చెట్టును నరికేశానని రైతు వెల్లడి
  • కోయంబత్తూరులోని సుల్తాన్‌పేట పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఘటన
  • రైతు అసలు సమస్యను తెలుసుకుని పరిష్కారిస్తామని చెప్పడంతో సద్దుమణిగిన గందరగోళం

తమిళనాడులోని కోయంబత్తూరు (కోవై) ప్రాంతంలో ఓ రైతు తనను అరెస్టు చేయాలంటూ పోలీసులను కాసేపు టెన్షన్ పెట్టాడు. వివరాల్లోకెళితే, కోయంబత్తూరు పరిధిలోని సుల్తాన్‌పేట వద్ద కొత్తగా నిర్మించిన పోలీసు స్టేషన్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వేలుమణి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది.

 వెస్ట్ జోన్ ఐజీ ఏ.పారీ, డీఐజీ (కోయంబత్తూరు రేంజ్) జి.కార్తికేయన్, జిల్లా ఎస్పీ పా మూర్తీ సహా పలువురు పోలీసు అధికారులు మంత్రి రాక కోసం ఎంతో ఆత్రుతగా, టెన్షన్‌గా ఎదురుచూస్తున్నారు. ఆ సమయంలో "నాపై కేసు నమోదు చేయండి. చట్టవిరుద్ధంగా నేనో ఎర్రచందనం చెట్టును నరికేశాను" అంటూ అక్కడకు 49 ఏళ్ల రైతు మోహన్‌రాజ్ వచ్చాడు. పోలీసులకు ఇలాంటి విచిత్రమైన వినతి చేశాడు.

కందంపాలెంకు చెందిన ఆ రైతు తనను అరెస్టు చేయమని అడగటానికి గల కారణాలను వివరించాడు. ఐదేళ్ల కిందట కోయంబత్తూరు అటవీ శాఖ అధికారుల అనుమతితో 400 కేజీల ఎర్రచందనం దుంగలను సత్యమంగళంలోని ఎర్రచందనం డిపోకి విక్రయించానని అతను చెప్పాడు. అయితే దానికి సంబంధించిన చెల్లింపులు తనకు ఇంతవరకు అందనేలేదని అతను వాపోయాడు. దీంతో కోపంతో మరో ఎర్ర చందనం చెట్టును అక్రమంగా నరికేశానని, అది నేరం కాబట్టి తనను అరెస్ట్ చేయాలని అతను కోరాడు.  

పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి మంత్రి వస్తున్నారని తెలిసి తన సమస్యకు పరిష్కారం దొరకవచ్చనే ఆలోచనతో ఇలా చేశానని అతను వివరించాడు. అతని గోడు విన్న పోలీసులు ఎట్టకేలకు అతని నుంచి ఓ పిటిషన్ తీసుకుని కమ్యూనిటీ సర్వీస్ రిజిస్ట్రార్ (సీఎస్‌ఆర్)కి నివేదించారు. అటవీ శాఖ అధికారుల దృష్టికి కూడా తన సమస్యను తీసుకెళ్లి తగు న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో అక్కడి నుంచి అతను వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మంత్రి వేలుమణి పోలీసు స్టేషన్‌ను ఆవిష్కరించారు.

More Telugu News