SHGs: 'పతంజలి'కి మహారాష్ట్ర సీఎం సతీమణి ప్రచారం...మహిళల నిరసనలు..!

  • సోలాపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి
  • పతంజలి ఉత్పత్తులను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని ప్రశంస
  • ఉత్పత్తుల విక్రయం ద్వారా వస్తున్న రాబడి దేశానికి ఉపయోగపడుతోందని వెల్లడి

'పతంజలి' ఆయుర్వేద ఉత్పత్తులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ప్రచారం చేయడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌‍సీపీ) మహిళా విభాగం కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. యోగా గురు రామ్ దేవ్ బాబాకి చెందిన పతంజలి ఆయుర్వేద్ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తుల ప్రచారం కోసం సోలాపూర్‌లో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అదే సమయంలో మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీఎస్) తయారు చేస్తున్న వస్తువులకు మార్కెట్ కల్పించకుండా పతంజలి ఉత్పత్తులకు ఎందుకు కల్పిస్తున్నారంటూ వేదికకు వెలుపల ఎన్‌సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

కార్యక్రమానికి అంతరాయమేర్పడకుండా వారిని అరెస్టు చేసి తర్వాత ఎలాంటి కేసులు నమోదు చేయకుండా విడుదల చేశామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ....పతంజలి ఉత్పత్తులను ప్రజలు పూర్తిగా నమ్ముతున్నారని, వాటి అమ్మకాల ద్వారా వస్తున్న రాబడి దేశానికి ఉపయోగపడుతోందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని కూడా హాజరయ్యారు.

More Telugu News