India: ఉన్న ఆయుధాలతోనే యుద్ధానికి రెడీ: ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

  • చాలినన్ని నిధులు లేవు, ఆయుధాలు పాతవే
  • పార్లమెంటరీ కమిటీ ముందుకు నివేదిక
  • రాత్రికి రాత్రే సమస్య పరిష్కారం కాదన్న రావత్
  • ఉన్న ఆయుధాలతోనే పోరుకు సైన్యానికి శిక్షణ

భారత రక్షణ రంగం వద్ద చాలినన్ని నిధులు లేవని, అత్యధిక శాతం ఆయుధాలు పాతబడినవేనని వచ్చిన వార్తలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. తమ వద్ద ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటితోనే యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్మీకి నూతన ఆయుధాలు సమకూర్చుకోవడం అన్న విషయం నిరంతరమూ జరిగేదేనని వెల్లడించారు.

కాగా, ఇటీవల పార్లమెంటరీ సబ్ కమిటీ ముందుకు ఓ నివేదిక రాగా, రక్షణ రంగానికి నిధులు సరిపోవడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధునాతన ఆయుధాల కొనుగోలులో భారత్ వెనుకబడి ఉందని, నవీన ఆయుధాల కొరత అధికమని కూడా ఈ నివేదిక వెల్లడించింది. యుధ్ధం జరిగితే పట్టుమని నెలరోజుల పాటు పోరాడేందుకు అవసరమైన మందుగుండు లేదని కూడా పేర్కొంది.

ఈ నివేదికపై స్పందించిన రావత్, రాత్రికి రాత్రే సమస్య పరిష్కారం అవుతుందని తాను భావించడం లేదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నిధుల కొరత ఉందని, అయితే, భారత సైన్యం తమ వద్ద ఉన్న ఆయుధాలతోనే పోరాడే శిక్షణ తీసుకుందని తెలిపారు. రక్షణ రంగానికి కేటాయిస్తున్న నిధులన్నీ సైన్యం నిర్వహణకు మాత్రమే సరిపోతున్నాయని వచ్చిన వార్తలను కూడా రావత్ ఖండించారు. రక్షణ రంగానికి ఇస్తున్న నిధుల్లో 35 శాతం మొత్తాన్ని సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాల నుంచి వచ్చే ముప్పును నివారించడంలో భారత సైన్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.

More Telugu News