TRS: నేతంటే ఇలా ఉండాలి! ఎన్నికల హామీల అమలు కోసం సొంత భూమిని అమ్మకానికి పెట్టిన టీఆర్ఎస్ మహిళా నేత!

  • నిధుల లేమితో హామీలు అమలు చేయలేకపోయానని ఆవేదన
  • ఆస్తి విక్రయం ద్వారా హామీలు అమలు చేయాలని నిర్ణయం
  • నేతంటే ఇలా ఉండాలంటూ ప్రశంసల వర్షం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల జడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ సంచలనం సృష్టించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సొంత ప్లాట్ ‌ను విక్రయానికి పెట్టారు. ‘‘ఎన్నికల్లో హామీలను చాలా సులభంగా ఇచ్చేస్తాం. కానీ వాటిని నెరవేర్చకుండానే పదవీ కాలం ముగిసిపోతుంది’’ అని పేర్కొన్న శైలజ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తన సొంత భూమిని అమ్మకానికి పెట్టడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.

శైలజ 2014 టీఆర్ఎస్ తరపున పోటీచేసి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తగిన నిధులు లేకపోవడంతో ఓ నిర్ణయానికి వచ్చిన శైలజ తన కుటుంబ ఆస్తిని విక్రయించడం ద్వారా వాటిని నెరవేర్చాలని భావించారు. ఈ మేరకు తన భూమిలో ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉండడం వల్ల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని, కాబట్టి ఈ ప్లాట్ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో కొంతమేరైనా హామీలు నెరవేర్చగలనని అందులో పేర్కొన్నారు. ఎవరైనా ముందుకొచ్చి మంచి ధరకు ఈ భూమిని కొనుగోలు చేయాలని అభ్యర్థించారు.

ఈ విషయం కాస్తా వైరల్ అవడంతో శైలజ వార్తల్లోని వ్యక్తి అయ్యారు. ప్లాట్ అమ్మకానికి పెట్టడంపై ఆమె మాట్లాడుతూ.. తాను ఎన్నికై నాలుగేళ్లు గడిచిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సీసీ రోడ్లు వేయిస్తానని, డ్రైనేజీలు నిర్మిస్తానని, సురక్షిత తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇటీవల ఆమె కనిపిస్తే హామీలపై ప్రజలు నిలదీయడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర వేదనకు లోనైన శైలజ.. భర్త సత్యనారాయణతో మాట్లాడి తమ ఆస్తిని విక్రయించాలని నిర్ణయించారు.

రెండు రోజుల క్రితం తమ భూమిలో ప్లాట్ అమ్ముతున్నట్టు బోర్డు పెట్టించారు. ప్లాట్ ఎందుకోసం విక్రయిస్తున్నదీ బోర్డులో స్పష్టంగా వివరించడంతో వైరల్ అయింది. విషయం తెలిసిన చాలామంది భూమిని కొనేందుకు ముందుకొస్తున్నారు. కాగా, హామీల అమలు కోసం ఆస్తిని అమ్ముకోవడానికి ముందుకు వచ్చిన శైలజపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News