Pawan Kalyan: కేఈ, గంటా, యనమల... పవన్ కల్యాణ్ పై ముప్పేట దాడి!

  • పవన్ టార్గెట్ గా టీడీపీ నేతల విమర్శలు
  • రాజకీయ పరిజ్ఞానం లేదన్న అయ్యన్నపాత్రుడు
  • రాజకీయ వ్యభిచారంలో భాగమైనాడని విమర్శలు
  • పవన్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న బుద్దా వెంకన్న

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ముప్పేట దాడికి దిగారు. ఎవరు ఎక్కడున్నా, పవన్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శించారు. వెలుగులోకి వచ్చిన అజ్ఞాతవాసి, అజ్ఞానంతో మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిప్పులు చెరిగారు. ఇతరుల స్క్రిప్టులు చదువుతూ తమపై బురద జల్లుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకుండా, టీడీపీని విమర్శించడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని అర్థమవుతోందని, నర్శీపట్నంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ చేస్తున్న రాజకీయ వ్యభిచారంలో భాగమైనాడని ఆరోపించారు.

ఒక్కో సినిమాలో ఒక్కోలా డైలాగులు చెప్పే పవన్, రోజుకో మాట మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న విమర్శించారు. చిత్తశుద్ధి లేని పవన్ వంటి వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మరో మంత్రి కేఎస్ జవహర్ ఏలూరులో మాట్లాడుతూ జనసేనది ప్రీ పెయిడ్ పోస్ట్, పెయిడ్ పార్టీ అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారని అన్నారు. అక్రమాస్తుల కేసుల్లో విచారణకు హాజరవుతున్న జగన్ వంటి వ్యక్తికి జనసేన దగ్గర కావడం అవినీతి రాజకీయాల్లో పరాకాష్టని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. బీజేపీకి, వైసీపీకి మధ్య వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వారధిలా మారారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలసి పోటీ చేస్తాయని స్పష్టమైందని అన్నారు.

More Telugu News