Mamata Banerjee: నేడు కోల్‌కతాకు కేసీఆర్.. మమతా బెనర్జీతో భేటీ.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చ!

  • ఉదయం 11:45 గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు
  • 3:30 గంటలకు మమతతో సమావేశం
  • సాయంత్రం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు

మూడో ఫ్రంట్ (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటులో బిజీగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ కానున్నారు. ఇందుకోసం ఈ ఉదయం 11:45 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్లనున్నారు. ఆయన వెంట ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ సహా మొత్తం 12 మంది వెళ్లనున్నారు.

మధ్యాహ్నం 1:45 గంటలకు తాజ్ బెంగాల్ హోటల్‌కు చేరుకోనున్న కేసీఆర్ భోజనం అనంతరం పలువురు రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం పశ్చిబెంగాల్ సచివాలయానికి చేరుకుని 3:30 గంటలకు మమతతో భేటీ అవుతారు. దాదాపు రెండు గంటలపాటు జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కాళీఘాట్ చేరుకుని కాళికాదేవిని దర్శించుకుంటారు. సాయంత్రం 7:30 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.

More Telugu News