RBI: పాత కరెన్సీ నోట్లను ఇటుకలుగా చేసి.. వేలం వేయబోతున్న ఆర్‌బీఐ!

  • కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ (సీవీపీఎస్) యంత్రాల్లో పాత నోట్ల ప్రాసెసింగ్
  • ప్రాసెస్ చేసిన నోట్లను రీసైకిల్ చేయబోమని ఆర్‌బీఐ స్పష్టీకరణ
  • జూన్ 30, 2017 నాటికి బ్యాంకులకు తిరిగి చేరిన రద్దయిన పెద్ద నోట్లు రూ.15.28 లక్షల కోట్లని ప్రకటన

ప్రాణం ఉన్నప్పుడే మనిషికి విలువ... చలామణిలో ఉన్నప్పుడే కరెన్సీకి విలువ. అలాంటి చలామణిలో ఉన్న పెద్ద నోట్లను (రూ.1000, రూ.500) మోదీ ప్రభుత్వం నవంబరు 8, 2016న రద్దు చేసింది. అలా రద్దు చేసిన పాత కరెన్సీ తిరిగి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కు చేరుకుంది.  దేశవ్యాప్తంగా పలు ఆర్‌బీఐ శాఖల్లో ఏర్పాటు చేసిన  అధునాతన కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ (సీవీపీఎస్) యంత్రాల్లో పాత నోట్లను ప్రస్తుతం ప్రాసెస్ చేస్తున్నారు.

ప్రాసెసింగ్ తర్వాత ఈ నోట్లను ముక్కలుముక్కలుగా చేసి ఇటుకల రూపంలోకి మార్చుతారు. చివరగా వాటిని వేలంపాట ద్వారా విక్రయిస్తారు. "రద్దు చేసిన రూ.500, రూ.1000 నోట్లు సహా పాత కరెన్సీ నోట్లను సీవీపీఎస్ యంత్రాల్లో లెక్కించి ప్రాసెస్ చేస్తున్నాం. ప్రాసెస్ చేసిన నోట్లను తర్వాత ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ష్రెడ్డింగ్ అండ్ బ్రిక్వెటింగ్ వ్యవస్థ ద్వారా ముక్కలుగా చేసి ఇటుకల రూపంలోకి మారుస్తాం" అంటూ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్‌బీఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఇలాంటి ప్రాసెస్ చేసిన నోట్లను రీసైకిల్ చేయబోమని బ్యాంకు స్పష్టం చేసింది. కాగా, గతేడాది జూన్ 30 నాటికి రూ.15.28 లక్షల కోట్ల రద్దయిన పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయని ఆర్‌బీఐ ప్రకటించింది.

More Telugu News