Vilambi: 'విళంబి'కి స్వాగతం పలుకుతున్న తెలుగు ప్రజలు... ఆలయాలు కిటకిట!

  • నేడు విళంబి నామ సంవత్సర ఉగాది
  • ఇష్ట దైవారాధనకు క్యూ కట్టిన తెలుగు ప్రజలు
  • ప్రధాన ఆలయాల్లో ఆర్జిత సేవలు రద్దు

తెలుగు రాష్ట్రాల ప్రజలు విళంబి నామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యే శుభవేళ, ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే తలంటి స్నానం, ఆపై దైవారాధన, ఉగాది పచ్చడితో దినచర్యను ప్రారంభించిన తెలుగు ప్రజలు, ఆపై నూతన సంవత్సరంలో తమ తమ రాశి ఫలాలు, గ్రహగతులు, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలిపే పంచాంగ శ్రవణం వినడం ఆనవాయతీ. కేవలం తెలుగు రాష్ట్రాల వారే కాదు... తమిళులు పుత్తాండు పేరిట, మలయాళీలు విషు పేరిట, మరాఠీలు గుడి పడ్వా పేరిట, సిక్కులు వైశాఖిగా ఇదే పండుగను జరుపుకుంటారు. వసంత రుతువు ప్రవేశించిన తొలి రోజున జరుపుకునే ఉగాది సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో నిత్యమూ ఉదయం జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇదే ఉగాది పర్వదినం నాడు బ్రహ్మదేవుడు మానవ సృష్టిని ప్రారంభించాడని కూడా పురాణాలు చెబుతున్నాయి. పండుగ నాడు తమతమ ఇష్ట దేవతలను ఆరాధించాలని దేవాలయాలకు ప్రజలు తరలివెళుతున్నారు. ఇక శాస్త్రీయ పద్ధతిలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడికి నేడు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. రుతువుల మార్పు కారణంగా వచ్చే వాత, పిత్త, కఫ దోషాలను నివారించే ఉగాది పచ్చడిని, వేపపువ్వు, చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, పచ్చి మిరప, పచ్చి మామిడి తదితరాలతో తయారు చేసి పరగడుపునే దాన్ని తీసుకోవడం ఆనవాయతీ.

More Telugu News