kambampati: కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షాతో భేటీ తరువాత ఎంపీ కంభంపాటి

  • ఏపీలో పలు పార్టీలు ప్రజల భావోద్వేగాలని ప్రేరేపిస్తున్నాయి
  • హోదా స్థానంలో అందుకు సమానమైన ప్రయోజనాలను కేంద్రం ఇస్తోంది
  • ప్రజల్లోకి ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం

ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో పలు పార్టీలు ప్రజల భావోద్వేగాలని ప్రేరేపిస్తున్నాయని, కానీ, హోదా స్థానంలో అందుకు సమానమైన ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. భారతీయ జనతా పార్టీ  జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో ఈ రోజు ఏపీ బీజేపీ నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ ముగిసిన తరువాత హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయాధ్యక్షుడితో కూర్చొని ఏపీ రాజకీయ అంశాలపై చర్చించామని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన ప్రయోజనాలను గురించి వివరించాలని తాము నిర్ణయించుకున్నామని కంభంపాటి హరిబాబు తెలిపారు. పోలవరం విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తోందని అన్నారు. ఏపీలో బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని జరిపి ప్రజల్లోకి ఎలా వెళ్లాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కొన్ని రాయితీలు ఇచ్చిందని అన్నారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొడతామని తెలిపారు.  

More Telugu News