Pawan Kalyan: పవన్‌పై ఎంఎల్ఏ జలీల్ ఖాన్ గరంగరం

  • చంద్రబాబు సర్కార్‌పై పవన్ ఆరోపణలపై అనుమానాలను వ్యక్తం చేసిన ఎంఎల్ఏ
  • పవన్‌కు స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో చెప్పాలంటూ డిమాండ్
  • అవిశ్వానికి జాతీయ పార్టీలు మద్దతివ్వడం బాబు విశ్వసనీయతకు నిదర్శనమని వెల్లడి

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎంఎల్ఏ జలీల్ ఖాన్ విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ ఆరోపణలు చేయడం తనకు పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారని, ఆ స్క్రిప్ట్‌ను ఎవరు రాసిచ్చారో చెప్పాలని జలీల్ డిమాండ్ చేశారు. ఎన్‍‌డీఏ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇతర జాతీయ పార్టీలన్నీ మద్దతిస్తున్నాయని, ఇది ఆయనపై ఉన్న విశ్వసనీయతకు నిదర్శనమని జలీల్ చెప్పుకొచ్చారు.

అయితే వైసీపీ అవిశ్వాసాన్ని ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. మంగళగిరిలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ సభలో విజయవాడ కనకదుర్గ గుడి పార్కింగ్‌ వ్యవహారానికి సంబంధించి ఎంఎల్ఏ నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారంటూ పవన్ ఆరోపించిన నేపథ్యంలో జలీల్ ఖాన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, తాజాగా గుంటూరులో అతిసార వ్యాధితో అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ బాబు సర్కార్‌పై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. రాజకీయాలు ప్రజల కోసం చేయాలని ఆయన హితవు పలికారు.

More Telugu News