Srividya: వేలానికి నటి శ్రీవిద్య ఇల్లు.. ఈనెల 27న చెన్నైలోని ఇంటిని వేలం వేయనున్న అధికారులు!

  • బహుభాషా నటిగా శ్రీవిద్యకు గుర్తింపు
  • 2006లో కేన్సర్‌తో మృతి
  • పన్ను చెల్లించకపోవడంతో చెన్నైలోని ఆమె ఇంటిని వేలం వేయనున్న అధికారులు

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి శ్రీవిద్య ఇంటిని వేలం వేసేందుకు ఆదాయపన్ను శాఖ సిద్ధమైంది. ఈ నెల 27న ఇంటిని వేలం వేయనున్నట్టు ప్రకటించిన అధికారులు ఇంటి ధరను రూ.1,17,20,000గా నిర్ణయించింది.

చెన్నైఅభిరామపురంలోని సుబ్రమణియంపురం వీధిలో శ్రీవిద్యకు రెండంతస్తుల ప్లాట్ ఉంది. ప్రస్తుతం ఇందులో డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. ఈ ఇంటికి చాలా కాలంగా పన్ను చెల్లించకపోవడంతో డ్యాన్స్ స్కూల్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని ఆదాయపన్ను శాఖ జమచేసుకుంటోంది. అయితే ఇంటి పన్ను, వడ్డీ విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ఇంటిని వేలం వేయాలని నిర్ణయించారు. మొత్తం 1250 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇంటిని వేలం వేయడం ద్వారా ఆ సొమ్మును జమచేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

దీర్ఘకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడిన శ్రీవిద్య మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. పలు భాషల్లో వందకుపైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించారు. కేన్సర్ వ్యాధి మరింత ముదరడంతో 2006లో మృతి చెందారు. చివరి రోజుల్లో మలయాళ నటుడు, కేరళ‌కు చెందిన ఎమ్మెల్యే గణేశ్ కుమార్ ఆమె బాగోగులు చూసుకున్నారు.  

More Telugu News