kj alfons: భారతకు వచ్చే పర్యాటకులు సంప్రదాయ దుస్తులే ధరించాలి: కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • గతంలో విదేశీయుల ఆహారపుటలవాట్లపై వ్యాఖ్యలు 
  • పర్యాటకులు సరైన దుస్తులు ధరించాలి
  • పర్యాటక దేశ సంప్రదాయాలను గౌరవించాలి

భారత్ కు వచ్చే పర్యాటకులు సంప్రదాయ దుస్తులే ధరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో విదేశీయుల ఆహారపుటలవాట్లపై సూచనలు చేసి వివాదం రేపిన ఆల్ఫోన్స్ మరోసారి విదేశీ పర్యాటకులను లక్ష్యం చేసుకున్నారు. ఒక వార్తా పత్రికతో ఆయన మాట్లాడుతూ, భారత్‌ కు వచ్చే టూరిస్టులు ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు ధరించాలన్నారు. దేశ సంస్కృతీసంప్రదాయాలను విదేశీయులు గౌరవించాలని ఆయన సూచించారు. విదేశాల్లో బికినీలు వేసుకుని వీధుల్లో తిరుగుతారని చెప్పిన ఆయన, భారత్ లో కూడా విదేశీయులు అలా తిరుగుతామంటే కుదరదని అన్నారు.

లాటిన్‌ అమెరికాలోని కొన్ని నగరాల్లో అక్కడి మహిళలు బికినీలు ధరించే వీధుల్లో నడుస్తారని ఆయన చెప్పారు. అక్కడ అది సాధారణ విషయమని చెప్పారు. అందులో ఇబ్బంది కూడా లేదని ఆయన చెప్పారు. అలాగే గోవా బీచ్ లలో కూడా పలువురు విదేశీయులు బికినీల్లో కనిపిస్తారని అన్నాడు. అవే దుస్తులు ధరించి నగరవీధుల్లో తిరుగుతామంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు. విదేశీయులు తాము పర్యటిస్తున్న దేశ సంప్రదాయాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలని ఆయన హితవు పలికారు. భారత్‌ కు వచ్చినప్పుడు చీర కట్టుకోవాలని తాను చెప్పడం లేదన్న మంత్రి, మంచి దుస్తులు ధరిస్తే సరిపోతుందని అన్నారు.

More Telugu News