Donald Trump Jr: విడిపోతున్న ట్రంప్ జూనియర్ దంపతులు.. 12 ఏళ్ల వైవాహిక బంధానికి విడాకులతో ముగింపు!

  • తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించిన ట్రంప్ జూనియర్ దంపతులు
  • దారులు వేరైనా పిల్లలే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడి
  • హాట్ టాపిక్‌గా మారిన విడాకుల వ్యవహారం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో తన 12 ఏళ్ల వైవాహిక బంధాన్ని ఆయన భార్య వెనీసా ట్రంప్ తెంచుకోనున్నారు. మాజీ మోడల్ అయిన వెనీసా భర్త నుంచి విడాకులు కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తామిద్దరం విడిపోతున్నట్టు ప్రకటించిన జూనియర్ ట్రంప్, వెనీసా.. విడిపోయినా ఒకరిని ఒకరం గౌరవించుకుంటామని పేర్కొన్నారు.

జూనియర్ ట్రంప్ (40), వెనీసా (40)లు 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్స్‌లో ఎగ్జిక్యూటివ్ అయిన జూనియర్ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తమ వివాహమై 12 ఏళ్లు గడిచాయని, ఇప్పుడు తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. తమకు ఐదుగురు అందమైన పిల్లలు ఉన్నారని, వారికి తామిచ్చే ప్రాధాన్యం ఎప్పటికీ అలాగే ఉంటుందని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా సంబంధాలపై ప్రత్యేక న్యాయవాదుల బృందం దర్యాప్తు ప్రారంభించిన తరుణంలో విడాకుల వ్యవహారం తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. 2016లో ట్రంప్ టవర్‌లో జరిగిన సమావేశంలో రష్యా లాయర్, ట్రంప్ ప్రచార ముఖ్యులు పాల్గొన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్‌పై బురద జల్లాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్టు జూనియర్ ట్రంప్ ఈ-మెయిల్స్ ద్వారా వెల్లడైంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో జూనియర్ ట్రంప్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

More Telugu News