cybercrime: మీరు కారు గెలుచుకున్నారంటూ మహిళకు 7 లక్షలకు టోపీ!

  • ఫోన్ చేసి, కారు గెలిచారంటూ చెప్పిన మోసగాళ్లు 
  • ముందుగా 1.5 లక్షలు జమ చేయించుకున్న తీరు  
  • ఇన్ కమ్ ట్యాక్స్ ఛార్జెస్ కోసం మరో 5.5 లక్షలు లాగిన మోసగాళ్లు 

'మీ అబ్బాయి కోసం బొమ్మలు కొంటే... మీరు కారు గెల్చుకున్నారు' అంటూ నమ్మబలికి 7 లక్షల రూపాయలకు టోపీ పెట్టిన ఘరానా మోసగాళ్లను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇలా www.flashy4u.com, www.myshopmydeals.com, www.shoppingflavour.com వెబ్ సైట్లలో కొనుగోళ్లు, ఆఫర్ల పేరిట మోసపోయినవారెవరైనా ఉంటే ఫోన్ నెంబర్ 9490617121 లో సంప్రదించాలని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

వారు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే...హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన మహిళకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు యోగేశ్‌ అని, తాను పేపాల్ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు, మొన్న మీరు www.shoppingflavour.com వెబ్‌ సైట్ నుంచి మీ కొడుకు కోసం బొమ్మ లు కొనుగోలు చేయగా, ఆ సంస్థ నిర్వహించిన లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారని తెలిపాడు.

అయితే, దానిని సొంతం చేసుకోవాలంటే ముందుగా మీరు 1.50 లక్షల రూపాయలు చెల్లించాలని సూచించాడు. దీంతో ఆ వ్యక్తి ఇచ్చిన స్కైలర్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఐసీఐసీఐ ఖాతాలో ఆ మొత్తాన్ని ఆమె జమ చేసింది. తరువాతి రోజు మరో నంబర్‌ తో మరో వ్యక్తి ఫోన్ చేసి, లాటరీలో గెల్చుకున్న కారు డెలివరీ కాబోతోంది. ఇన్ కమ్ ట్యాక్స్ ఛార్జెస్ కోసం బ్యాంక్ ఖాతాలో 5.5 లక్షల రూపాయలు ఉంచాలని సూచించాడు.

అలాగే మాటల్లో పెట్టి ఆమె నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ ను, ఓటీపీలను తీసుకున్నాడు. తరువాత ఆ మొత్తాన్ని తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి, నిందితులు ఢిల్లీకి చెందిన మ్రిదుల్ కపూర్, సుమిత్ సిగ్ సోలంకీలను అరెస్టు చేశారు. స్కైలర్ మార్కెటింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, పలు ఆన్ లైన్ వెబ్ సైట్లు నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తేల్చారు. దీంతో ఈ వెబ్ సైట్లలో కొనుగోలు చేసి మోసపోయిన వారెవరైనా ఉంటే తమను సంప్రదించాలని సూచించారు.

More Telugu News