Florida: ఆరు గంటల్లో నిర్మించిన బ్రిడ్జ్ నాలుగు రోజులకే కుప్పకూలింది.. పదిమంది దుర్మరణం!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • శనివారం అందుబాటులోకి.. అంతలోనే కూలిన వైనం
  • కొన్ని గంటలపాటు ఆగిపోయిన ట్రాఫిక్

పాదచారుల కోసం అమెరికాలోని ఫ్లోరిడాలో 'ఫ్లోరిడా ఇంటర్నేషనల్' యూనివర్సిటీ వద్ద ఇటీవల నిర్మించిన వంతెన కూలిన ఘటనలో పదిమంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని గంటలపాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. 950 టన్నుల బరువున్న ఈ బ్రిడ్జి కింద ఉన్న వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.

గాయాలపాలైన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుపోయి ఉన్నారేమోనన్న అనుమానంతో రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఫ్లోరిడా హైవే పెట్రోలింగ్ అధికారులు చెబుతున్నప్పటికీ ఎంతమంది అనే విషయాన్ని వెల్లడించలేదు.

ఫ్లోరిడా యూనివర్సిటీని స్వీట్‌వాటర్‌ నగరంతో అనుసంధానం చేసే ఈ వంతెనను ఎనిమిది లేన్ల రోడ్డుపై శనివారం నాడు కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనలో ఆరు నుంచి 8 మంది వరకు మృతి చెంది ఉంటారని ఫ్లోరిడాకు చెందిన సెనేటర్ బిల్ నెల్సన్ తెలిపారు. కాగా, తాను నిర్మించిన బ్రిడ్జి కూలిపోవడం తమ 40 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారని ఎఫ్ఐజీజీ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. బ్రిడ్జి కూలిన ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

More Telugu News